Radicals Students Union
-
ఆపరేషన్ అర్బన్ మావోయిజం
సాక్షి, హైదరాబాద్: అడవుల్లో పట్టుకోల్పోతున్నాం.. కంచుకోటలనుకున్న ప్రాంతాలపై పట్టు సడలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధాంతాన్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి? ఇదీ 14 ఏళ్లకు ముందే మావోయిస్టులు, వారి సిద్ధాంతకర్తల మధ్య జరిగిన మేధోమథనం. ఇందులో నుంచి పుట్టిందే ‘అర్బన్ మావోయిజం’. నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న సంఘటిత, అసంఘటిత వర్గాలను ఏకంచేసి ఉద్యమాలు నిర్వహించడమే ఈ వ్యూహం. 14 ఏళ్ల క్రితం మావో యిస్టులు రచించిన ఈ వ్యూహం.. గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం మాత్రం పోలీసుల రాడార్లోకి వచ్చింది ఈ ఏడాది జనవరిలోనే. భీమా–కోరేగావ్ ఘటన తర్వాత మహారాష్ట్ర పోలీసుల విచారణలో వెల్లడైన ఈ ‘గోల్డెన్ కారిడార్’వ్యవహారం.. ఏపీ, తెలంగాణ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మావోయిస్టులంటే అడువుల్లోనే ఉండాలి.. పోలీసులు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయాలన్న ఆలోచననుంచి కాస్త విభిన్నంగా.. నగరాలు, పట్టణాల్లో సైతం ఉద్యమాల నిర్వహణకు కార్యరూపం దాలుస్తున్నట్టు వరుసగా అర్బన్ మావోయిస్టుల అరెస్టులతో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యవహారంలో జరిగిన వరుస అరెస్టులతో.. పోలీస్ శాఖకు స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అర్బన్ మావోయిజం మావోయిస్టు పార్టీ 2004లో తీసుకున్న కీలక నిర్ణయం అర్బన్ నక్సలిజం. నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర వర్గాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం రూపంలో తమకు అనుకూలంగా మార్చుకోవలన్నది ఈ వ్యూహం వెనక ఉద్దేశమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయం 2018 వరకు బయటకు రాకపోవడం యావద్భారత పోలీసు వ్యవస్థను ఆందోళనకు గురిచేసింది. ఇటీవల గుజరాత్లో ప్రధాని మోదీ అ«ధ్యక్షతన జరిగిన అఖిలభారత డీజీపీల సదస్సులో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. భీమా–కోరేగావ్ వ్యవ హారంలో మావోయిస్టు పార్టీకి పౌర హక్కుల నేతలు సహకరిస్తున్నారని.. వీరి ద్వారా నగరాలు, పట్టణాల్లో విద్యార్థులు, కార్మికులు, దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపిస్తున్నారని పుణే (మహారాష్ట్ర) పోలీసులు ఆధారాలు సేకరిం చారు. అందులో భాగంగా మోదీ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలతో పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, అరుణ ఫెరీరాలపై వివిధ అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. చాపకింద నీరులా అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు నిధుల సమీకరణ, విప్లవ సాహిత్యం ప్రచురణ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని హెచ్చరించింది. ‘గోల్డెన్ కారిడార్’వ్యూహంతో.. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్‌చేసింది. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన వారు. వీరు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతమైన కామ్‌రాజ్‌నగర్, విక్రోలి, రాంబాయి అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటూ అక్కడ వలస కార్మికులుగా ఉన్న తెలంగాణ వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపించినట్టు గుర్తించారు. ఈ ఏడుగురికి.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సత్సంబంధాలున్నట్లు వెల్లడైంది. వీరి నుంచి భారీగా మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. అయితే వీరంతా అర్బన్ మావోయిజం వ్యూహంలో భాగంగా ఏర్పడిన గోల్డెన్ కారిడార్ కమిటీలో పనిచేస్తున్నారని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులను మావోయిస్టు పార్టీలో చేర్పించి.. ఉద్యమాలు, విధ్వంసకాండ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. తాజాగా.. నక్కా వెంకట్రావ్! అర్బన్ మావోయిజం వ్యవహారం ఏమాత్రం బయటకు పొక్కకుండా వ్యూహాత్మకంగా సాగుతోందని గుర్తించిన నిఘా వర్గాలు.. తాజాగా మరో తెలుగు వ్యక్తి, ఎన్జీఆర్ఐ(జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ)లో టెక్నికల్ ఉద్యోగి నక్కా వెంకట్రావ్‌ను అరెస్టు చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటన తెలంగాణ, ఆంధప్రదేశ్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. వెంకట్రావ్ నుంచి డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన రాడికల్ స్టూడెంట్ యానియన్‌లో 80వ దశకం నుంచే క్రియాశీలకంగా ఉన్నారని.. ఇటీవల అరెస్టయిన మావోయిస్టు కీలక నేత కుమార్ సాయి అలియాస్ పహీద్ సింగ్‌తో వెంకట్రావ్‌కు సంబంధాలున్నట్టు గుర్తించామని దుర్గ్ ఐజీ జీపీ సింగ్ స్పష్టంచేశారు. అయితే వెంకట్రావ్ జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ల్లో అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు నెట్వర్క్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు గుర్తించారు. వరుసగా అర్బన్ మావోయిజం దేశవ్యాప్త లింకులు వెల్లడవడం.. దీనికితోడు అరెస్టయిన వారంతా తెలుగువారే కావడం ఈ రెండు రాష్ట్రాల పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మన సంగతేంటి? ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు, మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టవడంపై చర్చ జరుగుతుండగా, తెలంగాణలో పరిస్థితి ఏంటన్న దానిపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల వేళ అలజడులకు అవకాశం ఇవ్వకుండా పనిచేసిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్బన్ మావోయిజం వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, జీఆర్డీ (గ్రామ రక్షక దళాలు), మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న పలు కమిటీల కీలక సభ్యులపై దృష్టి సారించినట్టు తెలిసింది. యూనివర్సిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, దళిత సంఘాలు, కుల సంఘాల్లో ఉన్న కొంత మందిని ఉద్యమం వైపు ప్రేరేపించి నియామకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పీడిత, బాధిత వర్గాలను అర్బన్ మావోయిజం వైపు ఆకర్శించేదిశగా పలువురు అర్బన్ మావోయిస్టు మేధావులు పనిచేస్తున్నారని.. వారిపైనా నిఘా పెట్టామని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో పేర్కొన్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న ఈ వ్యవహారం కొంత ఆందోళన పెడుతున్నప్పటికీ.. కట్టడి చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆయన సోమవారం వెల్లడించారు. -
సమస్యలు పరిష్కరిస్తా..
సెలైన్స్.. సెలైన్స్ అంటూ అసెంబ్లీని కొనసాగించే స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం సాయంత్రం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శాయంపేట మండలంలో ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారారు. చలివాగు రిజర్వాయర్ వద్ద మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికులు, గ్రామస్తులతో సుమారు రెండు గంటల పాటు ముచ్చటించి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. రాడికల్ విద్యార్థి నేత నుంచి రాజకీయాల్లోకి.. నిరుపేద కుటుంబంలో పుట్టినా.. రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ)లో పని చేశాను. రోజు ‘సాక్షి’ దిన పత్రిక చూస్తా. అందులో ప్రచురితం అయ్యే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. శాయంపేట మండల కేంద్రంలో మోడల్ స్కూల్, 30 పడకల ఆస్పత్రి, జోగంపల్లి, రాజుపల్లిల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. - మధుసూదనాచారి, స్పీకర్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్‌లో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి : ఏం తమ్మి బాగున్నావా? చలివాగు రిజర్వాయర్ మత్స్యకారులతో కళకళలాడుతోందా? అయిరబోయిన బిక్షపతి, మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్, పెద్దకోడెపాక : సర్కారు ఇచ్చిన చేపలను ఈ రోజు చెరువులో పోస్తున్నాం సార్. అందుకే మా వాళ్లు అందరూ వచ్చారు. స్పీకర్ : సరే.. మీ జీవనం ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బిక్షపతి : ఈ ఏడాది వర్షాలు లేవు. మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. మీ కృషితో దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు చేరింది. ఈ ఏడాది ప్రభుత్వం రుణం మాఫీ చేయాలని కోరుతున్నాం. స్పీకర్ : ‘మిషన్ కాకతీయ’ లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారా? నిమ్మల మహేందర్ : లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నాం. చలివాగు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తే మాతోపాటు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్పీకర్ : సంఘం ఎదుర్కొంటున్న అవస్థలు? పల్లెబోయిన అశోక్ : మా మండలానికి సర్కారు రెండు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేసింది. అవి గ్రామాల్లో నిర్మించనున్నారు. శాయంపేట మండల కేంద్రానికి ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తే సమావేశాలు నిర్వహించుకునేందుకు సులువుగా ఉంటుంది. స్పీకర్ : చేపలు పట్టడంలో కూలీ గిట్టుతుందా? ఇళ్లు గడస్తుందా? చాడ కిష్టస్వామి : దయనీయంగా ఉంది. చలివాగులో కొన్నేళ్లుగా కాంట్రాక్టరే చేప పిల్లలు పోస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి మత్స్యకారులను తీసుకొచ్చి చేపలను పట్టిస్తున్నాడు. మాకు కూలీ కూడా లేదు. ఈ ఏడాది చేప పిల్లలను ప్రభుత్వమే పోసినందున స్థానిక మత్స్యకారులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి. స్పీకర్ : ఎన్నేళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? మీ పిల్లలను ఇదే వృత్తిలో కొనసాగించాలని అనుకుంటున్నారా? ఐరవేని సదయ్య : తరతరాలుగా ఇదే వృత్తిపై బతుకుతున్నాం. మా పిల్లలతో ఈ పని చేయించాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. మా కులస్తుల కోసం ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. స్పీకర్ : మీ కుటుంబాల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? పల్లెబోయిన సారయ్య : చాలా తక్కువగా ఉన్నారు. మా కులాన్ని బీసీ‘డీ’ నుంచి బీసీ‘ఏ’కి మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. స్పీకర్ : ఆర్టీసీకి సంబంధించి సమస్యలు ఉన్నాయా? పెండ్యాల పైడి : శాయంపేట-పెద్దకోడెపాక గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మాందారిపేట క్రాస్‌రోడ్ వద్ద ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటున్నందున బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్డి నిర్మించాలి. స్పీకర్ : ప్రభుత్వం నుంచి ఏ పథకాలు ఆశిస్తున్నారు? ఐరబోయిన చేరాలు : ముదిరాజ్ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగలేదు. కళ్యాణలక్ష్మి పథకాన్ని ముదిరాజ్‌లకు వర్తింపజేయూలి. స్పీకర్ : ఏం తల్లి.. ఏం పని మీద చెరువు దగ్గరికి వచ్చావు? కూచనం సమ్మక్క : ఇక్కడికి సార్లు వస్తున్నరని తెలిసి వచ్చిన. నాకు 70 ఏళ్లు. ఇంతకు ముందు రూ.200 పింఛన్ వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ రూ.1000 ఇస్తందని తెలిసి మండలాఫీసుల దరఖాస్తు చేసుకున్న. కాని పింఛన్ రాలేదు నాయనా. స్పీకర్ : తల్లులు బాగున్నారా? బీడీలు చేస్తే రోజు కూలీ గిట్టుతుందా? క్యాతం విజయ : పదేళ్ల నుంచి బీడీలు చేస్తున్నాం. నెలలో పది రోజులే పని దొరుకుతాంది. రూ.1000 వస్తున్నాయి. కటింగ్ పోను రూ.700 చేతికి వస్తాయి. వ్యవసాయం, బీడీలు చుట్టడం.. రెండు పనులు చేసినా ఇళ్లు గడవడం కష్టంగానే ఉంది సారూ. స్పీకర్ : ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి కోరుకుంటున్నారు? గుండు సౌందర్య : పొగాకు పడక చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వయసు పరిమితితో సంబంధం లేకుండా పింఛన్లు అందించాలి. మాకు హెల్త్ కార్డులు అందజేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలి. స్పీకర్ : కరెంటు సమస్య ఏమైనా ఉందా? మెండు చంద్రకళ: కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వర్షాలు కురియక, కరెంటు ఉండక పంటలు ఎండినయ్. స్పీకర్ :చేనేత కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయా? బాసాని లక్ష్మీనారాయణ : గ్రామంలో సుమారు 600 మంది చేనేత కార్మికులు ఉండేవారు. కూలీ గిట్టక బీవండి, సిరిసిల్లకు వలసెళ్లారు. కొందరు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 150 మంది చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించాలి. స్పీకర్ :కాలుష్య ఇబ్బందులు ఉన్నాయా? దైనంపల్లి సుమన్ : కాలుష్య సమస్య లేదు. కానీ.. గ్రామ సమీపంలోని క్రషర్లతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్ల సమీపంలో కస్తూర్బా స్కూల్ సైతం నిర్మిస్తున్నారు. విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలి. స్పీకర్ : పంటలకు మద్దతు ధర లభిస్తుందా? శ్రీనివాస్ : ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రరుుస్తే మద్దతు ధర లభిస్తోంది. కానీ.. దళారులతో మోసపోతున్నాం. పత్తి, మిర్చి పంటలను విక్రయించేందుకు వరంగల్‌కు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలో మూసివేసిన సబ్ మార్కెట్‌ను తెరిస్తే చాలు. స్పీకర్ :విద్యాపరంగా శాయంపేట పరిస్థితి ఎలా ఉంది? పరకాల దేవేందర్ : మండలానికి చెందిన వందలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగావకాశాలు పొందారు. మోడల్ పాఠశాల లేకపోవడమే లోటు. నిర్మిస్తే బాగుంటుంది. స్పీకర్ : తాగునీరు దొరుకుతుందా? అమ్మ అశోక్ : జోగంపల్లి గ్రామస్తులు తాగునీరు దొరకడం లేదు. గత ప్రభుత్వం డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్‌ను పూర్తికాకముందే హడావుడిగా ప్రారంభించింది. కానీ.. నీరు సరఫరా కావడం లేదు. నాసిరకం పనుల మూలంగా పైప్‌లైను పైపులు పగిలిపోతున్నాయి. ప్రస్తుత సర్కారు మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు నీరందించాలి. స్పీకర్ : ఇంకా ఎక్కడ తాగునీటి సమస్య ఉంది? కానుగుల నాగరాజు : మండలంలోని రాజుపల్లిలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. చిన్నపిల్లలు నీటిని తాగి ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు. గ్రామంలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్‌ను నిర్మించి గ్రామస్తులకు తాగు నీరందించాలి.