సమస్యలు పరిష్కరిస్తా.. | problems solving... sakshi reporter by speakar madhusudhan chary | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరిస్తా..

Published Mon, Dec 15 2014 4:37 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సమస్యలు పరిష్కరిస్తా.. - Sakshi

సమస్యలు పరిష్కరిస్తా..

సెలైన్స్.. సెలైన్స్ అంటూ అసెంబ్లీని కొనసాగించే స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం సాయంత్రం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శాయంపేట మండలంలో ‘సాక్షి’ రిపోర్టర్‌గా మారారు. చలివాగు రిజర్వాయర్ వద్ద మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికులు, గ్రామస్తులతో సుమారు రెండు గంటల పాటు ముచ్చటించి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
 
రాడికల్ విద్యార్థి నేత నుంచి రాజకీయాల్లోకి..

నిరుపేద కుటుంబంలో పుట్టినా.. రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్‌ఎస్‌యూ)లో పని చేశాను. రోజు ‘సాక్షి’ దిన పత్రిక చూస్తా. అందులో ప్రచురితం అయ్యే ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. శాయంపేట మండల కేంద్రంలో మోడల్ స్కూల్, 30 పడకల ఆస్పత్రి, జోగంపల్లి, రాజుపల్లిల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. మత్స్యకారులు, బీడీ, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. - మధుసూదనాచారి, స్పీకర్

 
‘సాక్షి’ వీఐపీ రిపోర్టింగ్‌లో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

 
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి : ఏం తమ్మి బాగున్నావా? చలివాగు రిజర్వాయర్ మత్స్యకారులతో కళకళలాడుతోందా?
అయిరబోయిన బిక్షపతి, మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్, పెద్దకోడెపాక : సర్కారు ఇచ్చిన చేపలను ఈ రోజు చెరువులో పోస్తున్నాం సార్. అందుకే మా వాళ్లు అందరూ వచ్చారు.
 
స్పీకర్ : సరే.. మీ జీవనం ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
బిక్షపతి : ఈ ఏడాది వర్షాలు లేవు. మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. మీ కృషితో దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు చేరింది. ఈ ఏడాది ప్రభుత్వం రుణం మాఫీ చేయాలని కోరుతున్నాం.
 
స్పీకర్ : ‘మిషన్ కాకతీయ’ లాభం చేకూరుస్తుందని భావిస్తున్నారా?

నిమ్మల మహేందర్ : లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నాం. చలివాగు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తే మాతోపాటు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
 
స్పీకర్ : సంఘం ఎదుర్కొంటున్న అవస్థలు?

పల్లెబోయిన అశోక్ : మా మండలానికి సర్కారు రెండు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేసింది. అవి గ్రామాల్లో నిర్మించనున్నారు. శాయంపేట మండల కేంద్రానికి ఒక కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తే సమావేశాలు నిర్వహించుకునేందుకు సులువుగా ఉంటుంది.
 
స్పీకర్ : చేపలు పట్టడంలో కూలీ గిట్టుతుందా? ఇళ్లు గడస్తుందా?
చాడ కిష్టస్వామి : దయనీయంగా ఉంది. చలివాగులో  కొన్నేళ్లుగా కాంట్రాక్టరే చేప పిల్లలు పోస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి మత్స్యకారులను తీసుకొచ్చి చేపలను పట్టిస్తున్నాడు. మాకు కూలీ కూడా లేదు. ఈ ఏడాది చేప పిల్లలను ప్రభుత్వమే పోసినందున స్థానిక మత్స్యకారులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలి.
 
స్పీకర్ : ఎన్నేళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు? మీ పిల్లలను ఇదే వృత్తిలో కొనసాగించాలని అనుకుంటున్నారా?

ఐరవేని సదయ్య : తరతరాలుగా ఇదే వృత్తిపై బతుకుతున్నాం. మా పిల్లలతో ఈ పని చేయించాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. మా కులస్తుల కోసం ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
 
స్పీకర్ : మీ కుటుంబాల్లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు?
పల్లెబోయిన సారయ్య : చాలా తక్కువగా ఉన్నారు. మా కులాన్ని బీసీ‘డీ’ నుంచి బీసీ‘ఏ’కి మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తే మా పిల్లలకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
 
స్పీకర్ : ఆర్టీసీకి సంబంధించి సమస్యలు ఉన్నాయా?
పెండ్యాల పైడి : శాయంపేట-పెద్దకోడెపాక గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. మాందారిపేట క్రాస్‌రోడ్ వద్ద ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటున్నందున బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్డి నిర్మించాలి.
 
స్పీకర్ : ప్రభుత్వం నుంచి ఏ పథకాలు ఆశిస్తున్నారు?

ఐరబోయిన చేరాలు : ముదిరాజ్ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగలేదు. కళ్యాణలక్ష్మి పథకాన్ని ముదిరాజ్‌లకు వర్తింపజేయూలి.
 
స్పీకర్ : ఏం తల్లి.. ఏం పని మీద చెరువు దగ్గరికి వచ్చావు?
కూచనం సమ్మక్క : ఇక్కడికి సార్లు వస్తున్నరని తెలిసి వచ్చిన. నాకు 70 ఏళ్లు. ఇంతకు ముందు రూ.200 పింఛన్ వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ రూ.1000 ఇస్తందని తెలిసి మండలాఫీసుల దరఖాస్తు చేసుకున్న. కాని పింఛన్ రాలేదు నాయనా.
 
స్పీకర్ : తల్లులు బాగున్నారా? బీడీలు చేస్తే రోజు కూలీ గిట్టుతుందా?
క్యాతం విజయ : పదేళ్ల నుంచి బీడీలు చేస్తున్నాం. నెలలో పది రోజులే పని దొరుకుతాంది. రూ.1000 వస్తున్నాయి. కటింగ్ పోను రూ.700 చేతికి వస్తాయి. వ్యవసాయం, బీడీలు చుట్టడం.. రెండు పనులు చేసినా ఇళ్లు గడవడం కష్టంగానే ఉంది సారూ.
 
స్పీకర్ : ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి కోరుకుంటున్నారు?
గుండు సౌందర్య : పొగాకు పడక చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వయసు పరిమితితో సంబంధం లేకుండా పింఛన్లు అందించాలి. మాకు హెల్త్ కార్డులు అందజేస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రభుత్వ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలి.
 
స్పీకర్ : కరెంటు సమస్య ఏమైనా ఉందా?

మెండు చంద్రకళ: కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. వర్షాలు కురియక, కరెంటు ఉండక పంటలు ఎండినయ్.
 
స్పీకర్ :చేనేత కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయా?
బాసాని లక్ష్మీనారాయణ : గ్రామంలో సుమారు 600 మంది చేనేత కార్మికులు ఉండేవారు. కూలీ గిట్టక బీవండి, సిరిసిల్లకు వలసెళ్లారు. కొందరు ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 150 మంది చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందించాలి.
 
స్పీకర్ :కాలుష్య ఇబ్బందులు ఉన్నాయా?

దైనంపల్లి సుమన్ : కాలుష్య సమస్య లేదు. కానీ.. గ్రామ సమీపంలోని క్రషర్లతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్ల సమీపంలో కస్తూర్బా స్కూల్ సైతం నిర్మిస్తున్నారు. విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలి.
 
స్పీకర్ : పంటలకు మద్దతు ధర లభిస్తుందా?
శ్రీనివాస్ : ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రరుుస్తే మద్దతు ధర లభిస్తోంది. కానీ.. దళారులతో మోసపోతున్నాం. పత్తి, మిర్చి పంటలను విక్రయించేందుకు వరంగల్‌కు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలో మూసివేసిన సబ్ మార్కెట్‌ను తెరిస్తే చాలు.
 
స్పీకర్ :విద్యాపరంగా శాయంపేట పరిస్థితి ఎలా ఉంది?

పరకాల దేవేందర్ : మండలానికి చెందిన వందలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగావకాశాలు పొందారు. మోడల్ పాఠశాల లేకపోవడమే లోటు. నిర్మిస్తే బాగుంటుంది.
 
స్పీకర్ : తాగునీరు దొరుకుతుందా?
అమ్మ అశోక్ : జోగంపల్లి గ్రామస్తులు తాగునీరు దొరకడం లేదు. గత ప్రభుత్వం డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్‌ను పూర్తికాకముందే హడావుడిగా ప్రారంభించింది. కానీ.. నీరు సరఫరా కావడం లేదు. నాసిరకం పనుల మూలంగా పైప్‌లైను పైపులు పగిలిపోతున్నాయి. ప్రస్తుత సర్కారు మరమ్మతులు చేపట్టి గ్రామస్తులకు నీరందించాలి.
 
స్పీకర్ : ఇంకా ఎక్కడ తాగునీటి సమస్య ఉంది?

కానుగుల నాగరాజు : మండలంలోని రాజుపల్లిలో ఫ్లోరైడ్ సమస్య ఉంది. చిన్నపిల్లలు నీటిని తాగి ఫ్లోరోసిస్ బారిన పడుతున్నారు. గ్రామంలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్‌ను నిర్మించి గ్రామస్తులకు తాగు నీరందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement