
ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, మావోయిస్టుల కార్యకలాపాలు, నేరాలు – నివారణ... తదితర అంశాలపై నేడు సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రం లో పరిస్థితులు అంతటా అదుపులోనే ఉన్నాయి. కానీ, కొంతకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు మెల్లిగా ఊపందుకుంటున్నాయి. లాక్‌డౌన్ అనంతరం రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. ఈ సమయంలో నెట్‌వర్క్ పెంచుకోవడం, రిక్రూట్‌మెంట్, చందాల వసూలు, షెల్టర్‌జోన్స్ ఏర్పాటు తదితర విషయాల్లో మావోయిస్టులు కాస్త పట్టు సాధించగలిగారు.
లాక్‌డౌన్ ఎత్తివేశాక పలుమార్లు మావోలు– పోలీసులు పరస్పరం తారసపడి కాల్పులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ తొలిరెండు వారాల్లో నాలుగు ఎన్‌కౌంటర్లు జరగడం, ఎనిమిది మంది మావోలు మృతిచెందడం రాష్ట్రంలో తిరిగి మావోల ఉనికిని చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ అనంతరం మావోయిస్టులు ఆసిఫాబాద్, ములుగు, భద్రాచలం తదితర జిల్లాల మీదుగా రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్న విషయం, వారిని నిలువరించేందుకు తీసుకున్న చర్యలు, వ్యూహాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీజీపీ వివరించనున్నారు. సీఆర్‌పీఎఫ్ కోబ్రా తదితర దళాలతో కలిసి ఏజెన్సీ ఏరియాల్లో సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్లు, వినియోగిస్తోన్న ఆధునిక సాంకేతికతలపై సీఎంకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశముందని సమాచారం.
ఇటీవల డీజీపీ మహేందరెడ్డితో కేంద్ర ప్రత్యేక భద్రతా సలహాదారు విజయ్‌కుమార్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశిస్తోన్న మావోయిస్టులను నిలువరించేందుకు అవసరమైతే మరిన్ని బలగాలను పంపించేందుకు కేంద్రం తరఫున ఆయన హామీ ఇచ్చారని సమాచారం. ఈ అంశాలను కూడా సీఎం వద్ద డీజీపీ ప్రస్తావించే అవకాశాలున్నాయి.
మాదకద్రవ్యాలపైనా...
లాక్‌డౌన్‌లో రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో మాదకద్రవ్యాల సరఫరా ఆగిపోయింది. కానీ, లాక్‌డౌన్ అనంతరం హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా తిరిగి మొదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన.. హైదరాబాద్‌లో ఉత్పత్తి అయిన దాదాపు రూ.100 కోట్ల విలువైన మెఫిడ్రిన్, ఎఫిడ్రిన్.. డీఆర్‌ఐకు పట్టుబడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో మాదకద్రవ్యాల దందా నియంత్రణకు రాష్ట్ర పోలీసులు తీసుకుంటున్న చర్యలపైనా చర్చించే అవకాశముంది.
మరోవైపు రాష్ట్రంలో 2018 తో పోలిస్తే.. 2019లో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, మర్డర్లు, కిడ్నాపులు, ఆర్థిక, సైబర్‌నేరాలు పెరిగాయి. అయితే, ఈ నేరా లు సంఖ్యాపరంగా పెరిగినా.. అదుపులోనే ఉన్నాయని పోలీసుశాఖ ధీమాగా ఉంది. నేర దర్యాప్తు, ఆధారాల సేకరణలో తెలంగాణ పోలీసులు అవలంబిస్తోన్న విధానాలు, తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి డీజీపీ సమగ్రంగా వివరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment