Nalgonda: మళ్లీ ‘అన్నల’ అలికిడి! | Police doubt Maoist activities in Nalgonda | Sakshi
Sakshi News home page

Nalgonda: మళ్లీ ‘అన్నల’ అలికిడి!

Published Tue, May 2 2023 9:12 AM | Last Updated on Wed, May 3 2023 7:48 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో మళ్లీ మావోయిస్టుల అలికిడి మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దకాలంగా లేని మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ మళ్లీ మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు మండలం కొరటికల్‌కు చెందిన చెన్నగోని గణేశ్‌ అరెస్టు కావడంతో కలకలం రేగింది. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతూ యువత అర్బన్‌ నక్సలిజం వైపు అడుగులేస్తున్నారా? అంటే అవుననే వాదన అంతర్గతంగా వినిపిస్తోంది.

హైదరాబాద్‌ కేంద్రంగా యువత అర్బన్‌ నక్సలిజం పట్ల ఆకర్షితులు అవుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గణేశ్‌ అరెస్టే ఇందుకు ఉదాహరణ అన్న చర్చ సాగుతోంది. పదేళ్లుగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెద్దగా లేవు. ఒకప్పుడు జిల్లా నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, వారిలో అనేక మంది ఎన్‌కౌంటర్లలో చనిపోవడం, అరెస్టు కావడం, లొంగిపోవడంతో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న వారి సంఖ్య పది మందిలోపే ఉన్నట్లు పోలీసులు వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు వారందరూ బతికే ఉన్నారా? లేరా? అన్నది పోలీసులు స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో గణేశ్‌ అరెస్టు కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన చెన్నగోని గణేశ్‌ (22) నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడి చైన్నె అమృత కాలేజీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసిన గణేశ్‌ హైదరాబాద్‌ క్యాటరింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఎంఏ ఫిలాసఫీ పూర్తి చేసిన కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం జల్లెడ గ్రామానికి చెందిన కోట ఆనందరావు (26) హైదరాబాద్‌ అద్దె గదిలో ఉంటూ తను కూడా క్యాటరింగ్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు.

కుల నిర్మూలన వేదికలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఆనందరావు మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌లోనూ సహకరిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాది కిందటే ఆనందరావుతో గణేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఆనందరావు ఇచ్చిన నక్సల్స్‌ సాహిత్యం చదివి ఆకర్షితుడైన గణేశ్‌ను కూడా గత నెల 3వ తేదీన పార్టీలో చేర్పించాడు. దళం వద్దే వారం పాటు ఉన్న గణేశ్‌ తరువాత జిలెటిన్‌ స్టిక్స్‌, ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు తీసుకురావడానికి వెళ్లి ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం ఆగర్‌గూడ వద్ద ఏప్రిల్‌ 28వ తేదీన అనందరావుతోపాటు పోలీసులకు దొరికిపోయాడు. 29వ తేదీన పోలీసులు అరెస్టు చూపించారు. ఒకప్పుడు రాచకొండ దళానికి షెల్టర్‌ జోన్‌గా ఉన్న కొరటికల్‌ గ్రామానికి చెందిన గణేశ్‌ మావోయిస్టుల్లో చేరి దొరికిపోవడంతో కలకలం రేపింది.

మావోయిస్టుల్లో చేరే వారు లేరనుకుంటున్న తరుణంలో..
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో చేరే యువత లేరనుకుంటున్న తరుణంలో 22 ఏళ్ల గణేశ్‌ అరెస్టు చర్చనీయాంశంగా మారింది. గణేశ్‌ది నిరుపేద కుటుంబం. హైదరాబాద్‌లో ఉండి చదువుకుంటున్న గణేశ్‌ ఇలా మావోయిస్టులవైపు ఆర్షితుడు కావడం వెనుక బంధువులు, గ్రామంలో ఒకప్పటి మూలాలే కారణం కావచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే అరెస్టుకు మూడు రోజుల ముందు గణేశ్‌ గ్రామంలోనే ఉన్నాడని, అక్కడి నుంచే పోలీసులు తీసుకెళ్లారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

మిగిలింది కొద్ది మందే..
ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో మావోయిస్టులు ఉండగా, పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. అరెస్టు అయినవారు, లొంగిపోయిన వారు వందల సంఖ్యలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన వారు పార్టీలో ఉన్నది పది మందిలోపే. వారిలో ప్రధానంగా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హనుమంతు అలియాస్‌ రాజేష్‌ తివారి 1983 నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. ఒకసారి ఎన్‌కౌంటర్‌ చనిపోయారని అనుకున్నా.. తరువాత ఆయన బతికే ఉన్నారన్న సమాచారం పోలీసులకు ఉంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్న హనుమంతుపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన మందుగుల భాస్కరరావు 1991 నుంచి అజ్ఞాతంలో కొనసాగుతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాడు. జిల్లాకు చెందిన కొద్దిమంది కూడా చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోనే పని చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement