పర్ణశాల(భద్రాచలం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మహిళా దళ కమాండర్‌తో పాటు ముగ్గురు సభ్యులు మృతి చెందారు. జిల్లా ఎస్పీ జితేంద్ర శుక్లా కథనం ప్రకారం.. కుకడాంజోర్ పోలీస్‌స్టేషన్ పరిధి గుమియాబెడా ఆడవుల్లో కూంబింగ్ జరుపుతున్న జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి.
కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు సమీపంలోని దట్టమైన అడవిలోకి పారిపోయారు. అనంతరం ఘటన స్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు నాలుగు తుపాకులు, డిటొనేటర్లు, విద్యుత్ తీగలు, బ్యాటరీలు, నిత్యావసర వస్తువులు, పేలుడు పదార్థాలను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో దళ కమాండర్ రత్త జార, దళ సభ్యుడు సోములను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరిద్దరి తలలపై రూ.5లక్షల వరకు రివార్డు ఉందని ఎస్పీ చెప్పారు.
కాంకేర్ జిల్లాలో ఇద్దరిని చంపిన మావోయిస్టులు:
కాంకేర్ జిల్లా బందె పోలీస్‌స్టేషన్ పరిధిలో తాడంవెలి గ్రామం నుంచి మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతంలోని తాడ్‌గూడ రోడ్డులో కనిపించాయి. ఆగస్టు 26వ తేదీన సోను పధా(35), సోమ్‌జీ పధా(40)తోపాటు పాండురాం అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. పాండురాం తప్పించుకోగా సోను, సోమ్‌జీలను మావోయిస్టులు గొంతుకోసి చంపారు. ఇన్ఫార్మర్ల నెపంతోనే వారిని చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment