ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై పోలీసుల గస్తీ
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటోంది. దళ సభ్యుల సంచారం అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే వారికి దళ సభ్యులు కంటపడకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అనుమానిత ప్రాంతాలను తనిఖీలు చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతోపాటు పత్తి చేలు, ఆసిఫాబాద్ ప్రధాన రోడ్డుపై పోలీసుల గస్తీ కొనసాగింది. దీంతో సమీప గ్రామాల ప్రజల్లో తెలియని ఆందోళన మొదలైంది. పోలీసుల బందోబస్తుతో ఆయా ప్రాంతాల్లో హైఅలర్ట్ నెలకొంది. పోలీసులు అన్ని వైపులా నిఘా మరింత పెంచారు.
ఆర్నెల్లుగా అలర్ట్
కేబీఎం (కుమురం భీం మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని ఐదుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్నట్లు పోలీసులవర్గాలు గుర్తించండం తెలిసిందే. ఆర్నెళ్లుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట రాత్రింబవళ్లు కూంబింగ్, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్, తిర్యాణి, గుండాల, జన్నారం, ఊట్నూరు సమీప అటవీప్రాంతాలతోపాటు అనుమానిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తిర్యాణి మండలం టొక్కిగూడ అడవుల్లో కాల్పులు జరగగా.. తృటిలో మావోలు తప్పించుకున్నారు.
అంతేకాక దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్‌లో నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాకు ఇన్‌చార్జి ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మావోల సంచారంపై ప్రధానంగా దృష్టి సారించారు. నిత్యం పోలీసు అధికారులకు ఆదేశాలు ఇస్తూ.. దళ సభ్యుల సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సమీప అటవీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment