బోథ్ మండలం పొచ్చెరలో వెలిసిన పోస్టర్
సాక్షి, ఇచ్చోడ(బోథ్): జిల్లాలో ఒకప్పుడు మావోలకు కంచుకోటగా ఉన్న బోథ్ ప్రాంతంలో నాలుగురోజుల క్రితం మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడం కలకలం రేపుతోంది. మావోయిస్టు నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ స్వగ్రామమైన బోథ్ మండలం పొచ్చెరతో పాటు సోనాలలో పోస్టర్లు వెలియడంతో రెండు దశాబ్దాలపాటు ఎలాంటి అలజడిలేని గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, కంతి లింగవ్వ, వర్గీస్, సుదీరాము, మంగుల టీమ్ సభ్యులు ఎవరికి వారే వారి కోరియర్ల ద్వార ఆదివాసీ రైతులు, వ్యాపారస్తులు, కిరాణా దుకాణాదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పోస్టర్లలో ఆరోపించారు. ఆదివాసీ యువతను అడ్డం పెట్టుకుని మైలరాపు అడెల్లు, కంతి లింగవ్వ, వర్గీస్‌లు వారికి అనుకూలమైన ప్రాంతంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. ఆదివాసీ యువతను బలవంతంగా పార్టీలో చేర్చుకుని స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీ యువత చైతన్యవంతులై మావోయిస్టుల ఆగడాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాగా మారుమూల గ్రామాల్లో మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలియడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఆడిట్ భయం!
ఆదిలాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఆడిట్ భయం పట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు విడుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ, జమ వివరాలతో పాటు జీపీల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు అధికారులు సిద్ధం కానుండడంతో వణుకు మొదలైంది. చిన్నా పెద్ద పంచాయతీలనే తేడా లేకుండా అన్నీ జీపీల్లో పకడ్బందీగా ఆడిట్ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఏ పంచాయతీ అవినీతి బాగోతం బయటకు వస్తుందోనని పలువురిలో ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను ఏడాదికి రెండుసార్లు అన్ని జీపీలకు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ప్రారం«భం నుంచి ప్రత్యేక, ఎస్‌ఎఫ్‌సీ నిధులు విడుదల చేస్తోంది. జీపీల్లో ఈ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడత ఆగస్టులో నిర్వహించగా, రెండో విడత మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.
వంద జీపీల్లో పూర్తి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడిట్ నిర్వహించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో (25 శాతం)100 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా నేరుగా జీపీలకు వెళ్లి ఆడిట్ చేయడం అప్పట్లో కష్టంగా మారిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పంచాయతీల్లో తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా ఆడిట్ నిర్వహించారు. ఇందుకు రెండు నెలల సమయం పట్టింది. మిగతా జీపీల్లో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలోని వంద జీపీల్లో నిర్వహించిన ఆడిట్‌లో చాలా విషయాలు వెలుగుచూశాయి. 2019–20 సంవత్సరంలో కొన్ని జీపీలు ప్రభుత్వానికి సీనరేజీ చెల్లించలేదని, ఐటీ కట్టడం లేదని, జీఎస్టీ బకాయిలు ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం లేదని ఆడిట్‌లో తేలింది. అయితే ప్రభుత్వ ఖజానాలో నిధులు జమచేయడం లేదనే అంశాలు వెలుగుచూశాయి. అయితే ఆడిట్ సమయంలో రికార్డులు చూపించని జీపీలు 40 రోజుల్లోగా సరైన రికార్డులతో పాటు హార్డ్ కాపీలను అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. గడువులోగా వివరాలు సమర్పించకపోతే ఆడిట్‌లో తేలిన విషయాలనే ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని ఆడిట్ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు మిగతా పంచాయతీల్లో ఆడిట్ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
రేపటి నుంచి షురూ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు జిల్లాలోని అధికారులు గ్రామ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించనున్నారు. మొదటి విడత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 30 వరకు వంద పంచాయతీల్లో నిర్వహించగా, రెండోవిడత మిగతా 367 పంచాయతీల్లో మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. రేపటి నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు వెళ్లి ఆడిట్ చేస్తారు. టీం సభ్యులంతా ఒకే దగ్గర ఆడిట్ చేయాల్సి వస్తే మండల పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో ఆడిట్ చేస్తారు. ఇందుకు ఆయా జీపీలకు సంబంధించిన ఆదాయ, వ్యయ వివరాల రికార్డులు, పనులకు సంబంధించి ఎంబీ రికార్డులను ఎంపీవో అఫీసుకు జీపీ అధికారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు జిల్లాలో ఏడుగురు ఆడిట్ అధికారులతో రెండు టీంలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐదుగురు సీనియర్ ఆడిట్ అధికారులుండగా, ఇద్దరు జూనియర్, ఇద్దరు అసిస్టెంట్ ఆడిట్ అధికారులున్నారు.
ఆడిట్ చేస్తారిలా..
జీపీల్లో నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను పరిశీలిస్తారు. ఏ నిధులతో ఏ పనులు చేశారు? అందుకు సంబంధించిన ఎంబీ రికార్డులు పరిశీలిస్తారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు, వాటికి సంబంధించిన ఖర్చుల రికార్డులు, మిగిలి ఉన్న నిధులు వివరాలు పరిశీలిస్తారు. ఏఏ పనులు చేశారో క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి రికార్డులను పరిశీలించి అన్నీ సక్రమంగా చేశారా? లేదా అన్నది చూసి గ్రామాల వారీగా రిపోర్టు తయారు చేస్తారు. రికార్డులు లేని వాటిని రిమార్క్ రాసి ఉంచుతారు. పంచాయతీ అధికారులు చూసి ఆడిట్ అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలపై సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం ఇస్తారు. వివరాలు ఆడిట్ చేసిన అధికారి నుంచి టీం లీడర్‌కు, ఆ తర్వాత జిల్లా ఆడిట్ అధికారికి చేరుతాయి. ఆ తర్వాత డీఏవో సరైన వివరాలు లేని వాటికి సమాధానం ఇవ్వాలని కోరుతారు. గడువులోగా హార్డ్ కాపీలతో పాటు వివరాలు అందజేయాలి. లేదంటే జీపీల్లో చేసిన ఆడిట్ వివరాలనే ప్రభుత్వానికి, కలెక్టర్‌కు పంపిస్తారు. ఆ తర్వాత డీఏవో పంపిన నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
6 నుంచి ఆడిట్ ప్రారంభిస్తాం
ఈ నెల 6 నుంచి పంచాయతీల ఆడిట్‌ను ప్రారంభించనున్నాం. ఇది వరకే పైలెట్ ప్రాజెక్టు కింద వంద జీపీలను ఆన్‌లైన్‌లో ఆడిట్ చేశాం. ఇప్పుడు నేరుగా పంచాయతీలకు లేదా ఎంపీవో కార్యాలయాలకు వెళ్లి ఆడిట్ చేయనున్నాం. ఈ నెలాఖరులోగా జిల్లాలోని అన్ని జీపీల్లో ఆఫ్‌లైన్ ద్వారా ఆడిట్ పూర్తి చేస్తాం. – కె.రాజ్‌కుమార్, జిల్లా ఆడిట్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment