న్యూఢిల్లీ: 2016లో భారతదేశంలో జరిగిన దాడుల్లో సగం మరణాలు మావోయిస్టుల హింస వల్లే చోటుచేసుకున్నాయని సిడ్నీకి చెందిన ఒక అంతర్జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ హత్యలన్నీ రెడ్ కారిడార్‌గా పిలిచే ఈశాన్య, మధ్య, దక్షిణ భారతదేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే జరిగాయని పేర్కొంది. 2016లో భారత్‌లో మొత్తం 929 దాడులు జరిగాయని, 340 మంది ప్రాణాలు కోల్పోయారని సిడ్నీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఐదో గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్(జీటీఐ) నివేదికలో తెలిపింది. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఉగ్ర హింస తగ్గుముఖం పడుతున్నా 2016లో 18 శాతం పెరుగుదల నమోదైందని, మృతుల సంఖ్య పెరిగిందని స్పష్టం చేసింది.
గ్లోబల్ టెర్రర్ ఇండెక్స్ నివేదిక
ఉగ్ర హింసలో ఇరాక్, అఫ్గానిస్తాన్, నైజీరియా, సిరియా, పాకిస్తాన్, యెమెన్, సోమాలియా, భారత్‌లు మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. 2002 నుంచి భారత్‌లో హింస తగ్గుముఖం పట్టినా 2015తో పోలిస్తే మాత్రం 2016లో దాడులు 16 శాతం పెరగడం గమనార్హం. 2015లో మొత్తం 800 దాడులు చోటుచేసుకోగా 2016లో ఆ సంఖ్య 929కి పెరిగింది. 2015తో పోలిస్తే భారతదేశంలో ఈ దాడుల్లో మరణించినవారి సంఖ్య 18 శాతం పెరిగి 340కి చేరింది. ఇందులో సగం మంది మావోల హింసలో ప్రాణాలు కోల్పోగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హింసలో 30 మంది మరణించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఐదుగురిని బలితీసుకుంది.
జాబితాలోని మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలతో పోలిస్తే ఒక్కో దాడిలో మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉంది. భారత్‌లో సగటున ఒక్కో దాడిలో 0.4 మరణాలు చోటుచేసుకోగా మిగతా తొమ్మిది దేశాల్లో అది 2.7గా ఉంది. భారత్‌లో సగానికి పైగా దాడులు పోలీసులు, ప్రైవేటు వ్యక్తులే లక్ష్యంగా జరిగాయి. భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడులు ఎక్కువ శాతం ప్రమాదకరం కానివని నివేదిక వెల్లడించింది. ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు కొన్ని గ్రూపులు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నాయిని, ఇలాంటి దాడులు ఎక్కువగా మావోయిస్టులే చేస్తున్నారని పేర్కొంది. భారత్‌లో హింసకు పాల్పడుతున్న గ్రూపుల్లో ఎక్కువ శాతం రాజకీయ గుర్తింపు కోరుకుంటున్నాయని, అందువల్లే ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా అవి దాడులకు పాల్పడున్నట్లు నిర్ధారించారు.
నిజానికి 2016లో భారత్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో మూడొంతుల ప్రమాదకరంగా కానివే.. కేవలం 2 శాతం దాడుల్లో మాత్రమే రెండు కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. దేశంలోని మొత్తం 56 గ్రూపుల్లో 20 మాత్రమే ప్రాణహానికి పాల్పడ్డాయని జీటీఐ నివేదిక పేర్కొంది. ఇక ఈశాన్య భారతదేశంలోని తీవ్రవాద గ్రూపుల్లో నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ప్రమాదకరమని, 2016లో ఆ ఉగ్రసంస్థ 15 మందిని పొట్టనపెట్టుకుందని, అల్ఫా ఏడుగురుని హత్య చేసిందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ వెల్లడించింది. ఇక జమ్మూ కశ్మీర్‌పై పాకిస్తాన్‌తో ఉన్న వివాదమే భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయంగా నిషేధం ఉన్నా అవి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించింది. ప్రమాదకర ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లు అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని నివేదికలో వెల్లడించారు.
'రెడ్ కారిడార్' టెర్రర్
Published Sat, Nov 18 2017 2:52 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment