అరెస్టుల పర్వం! | Five Social Activists Are Arrested By Pune Police | Sakshi
Sakshi News home page

అరెస్టుల పర్వం!

Published Wed, Aug 29 2018 2:50 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM

Five Social Activists Are Arrested By Pune Police - Sakshi

దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు, దాడులు నిర్వహించి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అయిదుగురు నాయకులు–హైదరాబాద్‌లో విప్లవ రచయిత వరవరరావు, ముంబైలో హైకోర్టు న్యాయవాదులు వెర్నాన్‌ గోన్‌సాల్వెస్, అరుణ్‌ ఫెరీరా, ఫరీదాబాద్‌లో కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్, న్యూఢిల్లీలో పౌరహక్కుల నాయకుడు గౌతం నవల ఖాలను మహారాష్ట్రకు చెందిన పూణె పోలీసులు అరెస్టు చేశారు. పుణెకు సమీపంలోని భీమా– కొరెగావ్‌లో గత ఏడాది డిసెంబర్‌ 31న దళిత వీరుల సంస్మరణ సభకు ముందూ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఉదంతాలకు సంబంధించి సాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టులు చేశామని పోలీసులు చెబుతున్నారు.

ఆ ఉదంతాలతో మావోయిస్టు పార్టీకి సంబంధం ఉన్నదని, ఇప్పుడు అరెస్టయినవారంతా ఆ పార్టీతో సంబంధాల్లో ఉన్నవారేనని వారి అభియోగం. అంతే కాదు... భీమా–కొరెగావ్‌ తదనంతర పరిణామాల గురించి దర్యాప్తు చేస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టు పార్టీ పన్నిన కుట్ర వెల్లడైందంటున్నారు. ఈ అయిదుగురి అరెస్టుతో పాటు న్యాయవాది సుసాన్‌ అబ్రహాం(ముంబై), ఫాదర్‌ స్టాన్‌ స్వామి(రాంచీ), ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్తుంబ్డే(గోవా), జర్నలిస్టు క్రాంతి టేకుల(హైదరాబాద్‌) ఇళ్లలోనూ, వరవరరావు ఇద్దరు కుమా ర్తెల ఇళ్లలోనూ కూడా సోదాలు చేశారు.


ఇప్పుడు అరెస్టయిన అయిదుగురూ రహస్య జీవితం గడుపుతున్నవారు కాదు. వారి వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులుగా కొనసాగుతూ, హక్కుల ఉల్లంఘనలపై నిలదీస్తున్నవారు. ఆ విష యంలో తప్ప వీరిలో చాలామందికి సంస్థాగతంగా కావొచ్చు...విశ్వాసాలరీత్యా కావొచ్చు ఏకాభి ప్రాయం లేదు. వరవరరావు విప్లవ సాహిత్యోద్యమంలో దాదాపు అర్ధ శతాబ్ది నుంచి పని చేస్తు న్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) సంస్థాపక సభ్యుడాయన. మావోయిస్టు పార్టీతో సంబం ధాలున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం నిషేధించిన సంస్థల్లో విరసం లేదు. గోన్‌సాల్వెస్, అరుణ్‌ ఫెరీ రాలు న్యాయవాద వృత్తిలో ఉంటూ పౌరహక్కులకు సంబంధించి బలమైన గొంతు వినిపిస్తున్న వారు. మొన్న జూన్‌లో ఈ ఉదంతానికి సంబంధించే అరెస్టయిన అయిదుగురు సభ్యుల తరఫున న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్‌ వృత్తి రీత్యా న్యాయ వాది. సోషలిస్టు నాయకుడు స్వర్గీయ శంకర్‌ గుహ నియోగి స్థాపించిన ఛత్తీస్‌గఢ్‌ ముక్తి మోర్చాలో చురుగ్గా పనిచేసి ప్రస్తుతం భిలాయ్‌ గని కార్మిక సంస్థ నాయకురాలిగా, పీయూ సీఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. ఢిల్లీలో అరెస్టయిన గౌతం నవలఖా పౌరహక్కుల రంగంలో పనిచేస్తు న్నారు. చరిత్రలో భీమా–కొరెగావ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

200 ఏళ్లక్రితం ఆధిపత్య కులాలపై పోరాడి విజయం సాధించిన దళిత వీరుల స్మారక చిహ్నం అక్కడుంది. భీమా–కొరెగావ్‌ పోరాట ద్విశత జయంతి కావడంతో నిరుడు డిసెంబర్‌లో జరిగిన సదస్సుకు భారీ యెత్తున దళితులు హాజ రయ్యారు. సదస్సు జరిగిన రోజే ఘర్షణలు చెలరేగి దళిత యువకుడు చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఉదంతాలకు సంబంధించి గత మార్చిలో సమతా హిందూ అఘాదీ అధ్యక్షుడు మిలింద్‌ ఎక్బోటేను అరెస్టుచేశారు. ఆయన బెయిల్‌పై విడుదల య్యారు. ఈ కేసు అతీగతీ ఏమైందో తెలియదుగానీ... ఆ సదస్సులో ప్రసంగించిన వక్తలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయటం వల్లే హింస చెలరేగిందని పోలీసులు ఆరోపించారు. అనంతరం మొన్న జూన్‌లో దళిత కార్యకర్త సుధీర్‌ ధవాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, హక్కుల కార్యకర్త మహేష్‌ రౌత్, ప్రొఫెసర్‌ షోమా సేన్, రాజకీయ ఖైదీల హక్కుల కమిటీ నాయకుడు రోనా విల్సన్‌లను అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టయిన వారుగానీ, ఇంతక్రితం అరెస్ట యినవారుగానీ భీమా–కొరెగావ్‌ సదస్సుకు వెళ్లలేదు. ఆ సదస్సును రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబే డ్కర్‌తోబాటు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ పీబీ సావంత్, జస్టిస్‌ కోల్సే పాటిల్‌ నిర్వహించారు. ఆ ముగ్గురినీ ఇంతవరకూ పోలీసులు ప్రశ్నించనే లేదు!


ప్రధాని హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణ అసాధారణమైనది. దాన్ని తేలిగ్గా తీసుకోవాలని ఎవరూ అనరు. కానీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ కట్జూ మొదలుకొని పలువురు మాజీ న్యాయమూర్తులు, కొందరు రిటైర్డ్‌ పోలీసు ఉన్నతాధికారుల వరకూ ఆరోపణకు ఆధారంగా చూపుతున్న లేఖను కొట్టిపారేశారు. అది నమ్మశక్యంగా లేదన్నారు. వారి అభిప్రాయాల సంగతలా ఉంచి ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా పిలిపించి ప్రశ్నించే అధి కారం పోలీసులకుంటుంది. ఆ తర్వాత వారిని అరెస్టు కూడా చేయొచ్చు. ఆరోపణల్లోని నిజా నిజాలు కోర్టులు తేలుస్తాయి. అయితే ఆ ప్రక్రియకు కూడా ఒక విధానమంటూ ఉంటుంది. ఈ అయిదుగురి అరెస్టులోనూ పోలీసులు అది పాటించినట్టు కనబడదు. అరెస్టు చేసినప్పుడు వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలతో రాసే పంచనామా రిపోర్టు నిందితులకు తెలిసిన భాషలోనే ఇవ్వాలి.

ఇద్దరు స్థానికులు సాక్షులుగా ఉండాలి. లేఖ బయటపడ్డాక ఏడు నెలలపాటు దర్యాప్తు సాగించిన పోలీసులు ఇలాంటి నిబంధనలు పాటించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కారణాలు చూపే ఢిల్లీ హైకోర్టు గౌతం నవలఖానూ, పంజాబ్‌ హర్యానా హైకోర్టు సుధా భర ద్వాజ్‌నూ పుణెకు తీసుకెళ్లేందుకు పోలీసులను అనుమతించలేదు.  వరవరరావు విషయంలో సైతం ఈ నిబంధన బేఖాతరైంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొదలుకొని చరిత్రకారుడు రామ చంద్ర గుహ వరకూ అనేకమంది ప్రముఖులు ఈ అరెస్టుల్ని ఖండించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వర్తమాన పరిస్థితులను ఎమర్జెన్సీ కాలంతో పోల్చింది. తీసుకునే చర్యలేమైనా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని... విమర్శలకూ, ఆరోపణలకూ అతీతంగా ఉండాలని ప్రభు త్వాలు గుర్తించటం అవసరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement