ప్రధాని హత్యకు కుట్ర చేశారనే అర్థం పర్థం లేని ఆరోపణ కింద, నకిలీ ఉత్త రాలు సాక్ష్యాలుగా చూపి విప్లవ కవి వరవరరావును ఐదు నెలలుగా దుర్భరమైన పూణే జైల్లో నిర్బంధించారు. సెషన్స్ కోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కలిసే అవకాశం ఉంటుందని తెలిసి వీవీని చూడ్డానికి తెలంగాణ నుండి 26 మంది రచయితలు, ప్రజాసంఘాల మిత్రులం వెళ్లాం. నిరీక్షణలో అరుణ్ ఫెరేరా సహచరి పరిచయమైంది. అరుణ్ ఇదివరకే సుమారు ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. జెన్నిఫర్ కొడుకుని తలచుకుంటూ తను మొదటిసారి అరెస్టయినప్పుడు వాడికి రెండేళ్లని, విడుదలయ్యాక వచ్చిన తండ్రిని వింతగా చూస్తుంటే మీ నాన్న అని పరిచయం చేయవలసి వచ్చిందని చెప్పింది. ఇప్పుడు పన్నెండేళ్లొచ్చి విషయాలు అర్థం అవుతున్నాయి గనుక నాన్నను మళ్లీ ఎప్పుడు చూస్తానని అడుగుతున్నాడట.
చివరికి వీవీని చూడగలిగాం. నల్లబడిన శరీర రంగు, సన్నబడ్డ దేహం, కానీ అదే ఉత్సాహం. దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటే కళ్లను కప్పేస్తూ నీటిపొర. వీవీ ముఖంలో ఎన్నడూ లేనంతగా వృద్ధా ప్యం పైకి తేలింది. షోమాసేన్ బక్కచిక్కిపోయింది. చూపుడువేలితో అభినయిస్తూ చాలా సన్నబడ్డావని పరామర్శిస్తున్న మిత్రులకు ‘మంచిదేగా’ అని నవ్వుతూ సమాధానం చెప్తున్నారామె. సుధా భరద్వాజ్‌కు అభివాదం చేస్తుంటే విప్పారిన చిరునవ్వుతో ఆమె పలకరింపులు ప్రసన్నంగా ఉన్నాయి.
బయట ఉంటే తీరిక లేకుండా ఉండే వీవీకి ఇక్కడి ఖాళీతనంతో పాటు ఉన్న భౌతిక స్థితి వల్ల, అననుకూల పరి సరాల్లో వయసు వల్ల తిరగబెట్టిన అనారోగ్యాల వల్ల చాలా అలసిపోయి కనిపిస్తున్నారు. ఇరుకు బెంచీలో ఆయన కోరికమీద పక్కన సర్దుకొని కూర్చున్నాను. అక్కడ సాయిబాబా, ఇక్కడ ఈయన? తనతో పాటు అదే బ్యారక్‌లో ఉంటున్న ఉరిశిక్షపడ్డ ఖైదీల గురించి, ముఖ్యంగా వారిలో కేవలం ముస్లింలుగా పుట్టినందువల్ల అల్‌ఖైదా ముద్ర వేయించుకున్న ఇద్దరని గురించి బాధపడుతున్న వీవీ, సాహిత్యం గురించి ముచ్చటిస్తూ తెలుగులో మాట్లాడక ఎన్నాళ్లయిందో అన్నప్పుడు తన స్థితిని ఆదివాసులతో పోల్చుకున్నారు. ఆదివాసుల భాష, సంస్కృతి, ఉనికి కూడా గల్లంతవుతున్నది కదా, అదింకెంత దుర్భరం అన్నారు. నోట్‌బుక్కులెన్నో కవిత్వం, అనువాదాలు, అనుభూతులతో నింపేసారు కానీ, తెలుగు కావడం వల్ల బైటికి పంపనివ్వడంలేదట. ఇంగ్లీషులో ఉత్తరాలు రాయగలిగినా, సహచరికి తెలియని ఇంగ్లీషు భాషలో రాయలేక మానేసానన్నారు. ఎనభైలలో జైలునుండి రాసిన ప్రేమలేఖల్లో సెన్సార్ అవుతున్న ప్రేమ గురించి బాధపడ్డ కవి, ఇప్పుడు ప్రేమను వ్యక్తీకరించే భాష కూడా చేతికందక విలవిల్లాడుతున్నాడా? అక్కడ నాగ్‌పూర్‌లో సాయిబాబాను కనీసం కుటుంబసభ్యులతో కూడా తెలుగు మాట్లాడనివ్వడం లేదని వసంత చెప్పింది. ప్రొఫెసర్ షోమాసేన్ ఆర్థరైటిస్ వల్ల కిందకూర్చోలేక, ఎన్నిసార్లు విన్నవించినా కుర్చీ ఇవ్వని జైలు కాఠిన్యంలో శరీరం కృశించిపోయే స్థితి. రిటైర్ అవ్వడానికి కొద్దిరోజుల ముందు ఈ కేసువల్ల నాగపూర్ యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని స్థితి.
ప్రతిష్టాత్మక పీఎంఆర్‌డీ ఫెలోషిప్ సాధించిన చురుకైన పరిశోధక విద్యార్థి మహేశ్ రౌత్, తన చదువును, మనసును, ఆచరణను కూడా ఆదివాసులపై లగ్నం చేసినందుకు ఇక్కడ ఇలా వీళ్ల మధ్యకు వచ్చి చేరాడు. వీళ్ల బెయిల్ వినతిని తిరస్కరించమని ఆరోజు ప్రాసిక్యూషన్ చేసిన వాదనలో ఎల్గార్ పరిషత్ పేరు మీద దళితుల్ని సమీకరించడం అనే ‘నేరాన్ని’ గురించి పదేపదే ప్రస్తావించడం విన్నాం. వీవీని ఉద్దేశించి ‘బడా నేతా’ అంటున్నప్పుడు ఆయనకేసి చూస్తే నవ్వుతున్నారు. ఆయనే కాదు, ఆ తొమ్మిదిమందీ ఎవరిపేరు ప్రస్తావనకొచ్చినా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిరునవ్వులు చిందిçస్తున్నారో, అంతగా కసి, ద్వేషం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతులో వినిపించి ఆశ్చర్యపోయాం. ఆ రోజే విన్న కొత్త వింత వాదన, భీమా కోరేగావ్ అల్లర్లలో నిందితులుగా సంఘ్‌పరివార్ నాయకులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్‌బొటేల పేర్లు డిఫెన్స్ వారు తెస్తున్నారని, వారికి అందులో ఏ ప్రమేయం లేకున్నా కేసు తప్పుదారి పట్టించడానికే ఇందులోకి లాగుతున్నారని చెప్పడం. నిజానికి భీమా కోరేగావ్ అల్లర్ల మీద మొదట దాఖ లైన ఎఫ్‌ఐఆర్ ఆ ఇద్దరి మీదే! వీడ్కోలు సమయంలో బిగిసిన పిడికిలి చూస్తున్నప్పుడే కాదు ఎప్పటికీ వీవీ చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘‘దళితులు ఆదివాసీల జీవితాలను, పోరాటాలను గురించి మాట్లాడే స్వేచ్ఛను మేం కోల్పోయాం. అది బాధాకరమేగానీ, మా గురించి మాట్లాడే స్నేహితులు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతే ఆ మాత్రం స్వేచ్ఛ త్యాగం చేసిన తృప్తి మిగులుతుంది’’.
వ్యాసకర్త విరసం కార్యవర్గ సభ్యురాలు
ఈ–మెయిల్ : varalurwa@gmail.com
పి.వరలక్ష్మి
ఖైదు కవితో కరచాలనం
Published Fri, Apr 26 2019 1:12 AM | Last Updated on Fri, Apr 26 2019 1:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment