ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ లోని అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మాకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లో చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు అడవులబాట పట్టారు.
హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికి త్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఇటీవల అగ్రనేత ఆర్కేను కోల్పోయిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో చికిత్స అందకనే తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలకు వచ్చి ఉంటాడని నిఘా వర్గాలు తెలిపాయి. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడం తో ఏజెన్సీ అంతా హైఅలర్ట్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment