వాయిస్ రికార్డర్ అమర్చిన కారు (మంత్రి నివాసంలో పార్కు చేసి ఉన్న కారు)
నర్సీపట్నం: మంత్రి అయ్యన్న సోదరుడి కారులో నాలుగు నెలల క్రితం వాయిస్ రికార్డర్ అమర్చినట్లు తేలడం ఇంటెలిజన్స్, పోలీసు వర్గాలకు సవాల్ విసిరినట్లైంది. ఈ విషయమై ‘సాక్షి’లో ప్రముఖంగా వచ్చిన కథనం పట్టణంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వాస్తవానికి మంత్రి అయ్యన్న తనయుడు విజయ్ లేటరైట్ దందాలకు పాల్పడుతున్నారని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆరు నెలలు క్రితం మావోయిస్టులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికల దృష్ట్యా మంత్రి అయ్యన్న నివాసంతో పాటు సందర్శించే వారిని నిశితంగా పరిశీలించాల్సి ఉంది. కారులో వాయిస్ రికార్డర్ అమర్చడాన్ని బట్టి, ఇంటి భద్రతను పోలీసులు పూర్తిగా గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.
ఇప్పుడీ విషయం పట్టణంలో చర్చనీయాశంగా మారింది. రికార్డయిన వాయిస్ ఎప్పటికప్పుడు బయటికి పొక్కిందా..? అన్నది తేలాల్సి ఉంది. మంత్రి నివాసంలో వాహనం పార్కు చేసి ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం నిత్యం ఏదో ప్రాంతానికి సోదరుడి దంపతులతో పాటు ముఖ్య అనుచరులతో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈ సమయంలో వారు అంతర్గతంగా చర్చించుకున్న అంశాలు ఈ రికార్డర్ ద్వారా ఏమేరకు అమర్చిన వ్యక్తులకు చేరి ఉంటాయో పోలీసులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏదైనా బలమైన అంశాలపై జరిగిన చర్చలకు సంబంధించి వాయిస్ రికార్డర్‌లో నమోదై ఉంటే భవిష్యత్తులో ఎటువంటి పరిణామానాలకు దారి తీస్తుందో.. రికార్డయిన అంశాలు మంత్రిపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా వెళ్లి అందరి నోళ్లలో తలలో నాలుకుగా ఉండే సన్యాసిపాత్రుడి కారులో వాయిస్ రికార్డర్ పెట్టడాన్ని పట్టణ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment