పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం.. | - | Sakshi
Sakshi News home page

పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం..

Published Sun, May 7 2023 10:24 AM | Last Updated on Sun, May 7 2023 10:56 AM

- - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): జిల్లాలోని బీర్‌పూర్‌ మండలం సుమారు 15ఏళ్లక్రితం వరకూ మావోయిస్టు(అప్పటి పీపుల్స్‌వార్‌)లకు పెట్టని కోటలా ఉండేది. కానీ, శుక్ర, శనివారాల్లో స్థానిక ప్రజాప్రతినిధులకు మావోయిస్టుల పేరిట లేఖలు రావడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్‌రావు ఉరఫ్‌ గణపతి స్వగ్రామం నిన్నటివరకూ ప్రశాంతంగా ఉంది. కానీ, నక్సల్స్‌ లేఖలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

గోదావరి బెల్ట్‌ ఏరియా కమిటీ పేరిట లేఖలు..
గోదావరి బెల్ట్‌ ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్‌ పేరిట స్థానిక ప్రజాప్రతినిధులకు లేఖలు అందినట్లు తెలిసింది.

సీపీఐ – మావోయిస్టు జగదల్‌పూర్‌ జిల్లా ఏరియా కమిటీ పేరిట లెటర్‌హెడ్‌లపై ఆ లేఖలు ఉన్నాయి.

మరికొన్నింటిపై మల్యాల ఏరియా కమిటీ ఉంది.

వీటిని సానుభూతిపరులు పంపించారా, గతంలో నక్సల్స్‌తో సంబంధాలు నెరిపిన వారు పొస్టు చేశారా? అనేదానిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.

లేఖల్లో ఏముందంటే..
అటవీభూములు కబ్జా చేసి, అక్రమంగా పట్టాలు చేశారని, ఈవిషయంలో రెవెన్యూ, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు రూ.లక్షలు పంచుకున్నారని ఆరోపించారు. అడవుల్లో చెట్లు నరికినా, భూములు కబ్జా చేసినా, అందుకు ప్రోత్సహించినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నర్సింహులపల్లె గ్రామంలో ఓ వ్యక్తి అక్రమంగా దుకాణం నిర్మించారని, తక్షణమే తొలగించాలని లేఖల్లో హెచ్చరించారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పంచాయితీలు చేస్తున్నారని, అక్కడిదాకా వెళ్లకుండా చూడాలని సూచించారు. మరికొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తారని ప్రస్తావించారు.

పద్మక్క ఇచ్చిన రూ.15లక్షల కోసం వస్తాం..
అప్పటి నక్సల్స్‌ నేత పద్మక్క మార్చి 2003లో ఓ వ్యక్తికి రూ. 15 లక్షలు ఇచ్చారని, ఇందులో రూ.1,000 నోట్లు, రూ.500 నోట్లు ఉన్నాయని లేఖలో తెలిపారు. కొద్దిరోజులకే నేరెళ్ల ఎన్‌కౌంటర్‌లో పద్మక్క మృతిచెందారని, ఆమె ఇచ్చిన సొమ్ము కోసం త్వరలో వస్తామని, సిద్ధంగా ఉండాలని లేఖలో ఉంది.

అయితే, అత్యధిక మంది ప్రజాప్రతినిధులకు అందిన లేఖలో అటవీ భూముల్లో చెట్లు నరికివేతన, భూము కబ్జా, అక్రమ పట్టాల గురించి ప్రస్తావన ఉంది. వీరు తమ పద్ధతులు మార్చుకోకుంటే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులతోపాటు నర్సింహులపల్లెలో సాధారణ వ్యక్తులకు కూడా హెచ్చరిక లేఖలు అందినట్లు తెలిసింది.

అనేక అనుమానాలు..
మావోయిస్టుల పేరిట ప్రజాప్రతినిధులు, గ్రామస్తులకు అందిన లేఖలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడ్చిరోలిలో పోస్టు చేసినట్లు ఉన్నాయని కొందరు చెబుతుండగా, అక్కడి పార్టీ లెటర్‌హెడ్‌లపై రాసి పోస్టు చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. అంతేకాదు.. అన్నిలేఖల్లోనూ ఓ వ్యక్తి దుకాణం కూల్చి వేయాలని హెచ్చరించడం కొందరు కావాలనే చేసిన పనిగా భావిస్తున్నారు. లేఖలు అందుకున్న కొందరు పోలీస్‌ ఉన్నతాధికారులను ఆశ్రయించగా, మరికొందరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లోని అధికారులను కలిసి నట్లు తెలిసింది.

పీపుల్స్‌వార్‌ గత ప్రాబల్యం ఇదీ..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అప్పటి (సీపీఐ – ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌లో తూర్పు, పశ్చిమ డివిజన్‌ కమిటీలు ఉండేవి.

తూర్పు డివిజన్‌లో పెద్దపల్లి, గోదావరిఖని – రామగుండం, కరీంనగర్‌, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌, మంథని ప్రాంతాలు ఉండగా, పెద్దపల్లి దళం, మంథని దళం, హుస్నాబాద్‌ దళాలు వాటి పరిధిలో కార్యకలాపాలు నిర్వహించేవి.

పశ్చిమ డివిజన్‌లో జగిత్యాల, మల్యాల, మానేరువాగు, సిరిసిల్ల, కామారెడ్డి, కమ్మర్‌పల్లి, మెట్‌పల్లి, కోరుట్ల ప్రాంతాలు ఉండేవి. ఇందులో మల్యాల, జగిత్యాల, మెట్‌పల్లి దళాలు పనిచేస్తూ ఉండేవి. వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో జనశక్తి ప్రాబల్యం ఉండేది. మల్లన్నపేట ఎన్‌కౌంటర్‌ తర్వాత పీపుల్స్‌వార్‌ మల్యాల దళాన్ని ఎత్తివేసింది. మెట్‌పల్లి, జగిత్యాల దళాలను కలిపి ఒకే దళం లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌(ఎల్‌జీఎస్‌)గా ఏర్పాటు చేసింది. ఇప్పుడు పంపిన లేఖల్లో మల్యాల ఏరియా కమిటీ, గోదావరి ఏరియా బెల్ట్‌ కమిటీ పేరుతో ఉండడం, దానికిందే గోదావరి బెల్ట్‌ కార్యదర్శి మల్లికార్జున్‌ పేరు ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement