
‘చీట్’ఫండ్ వ్యాపారం
జగిత్యాల పట్టణంలోని ఓ షాపు నిర్వాహకుడు రాజు కరీంనగర్‌రోడ్‌లోగల లో చిట్‌ఫండ్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి చాలా రోజులు అవుతున్నా డబ్బులు చెల్లించకపోవడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇటీవల బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు.
జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కరీంనగర్‌రోడ్‌లోగల ఓ చిట్‌ఫండ్‌లో రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. కాల పరిమితి ముగిసి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంతో 15 రోజుల క్రితం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సదరు చిట్‌ఫండ్‌పై కేసు నమోదు చేశారు.
● జగిత్యాల జిల్లాలో ప్రతినెలా రూ.70 కోట్ల లావాదేవీలు
● కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించని నిర్వాహకులు
● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు
19జెజిఎల్51 : రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో విచ్చలవిడిగా చిట్‌ఫండ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇది చాలదన్నట్లు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో దాదాపు 33 చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో కేవలం పదింటికి మాత్రమే లైసెన్స్ ఉంది. అలాగే జిల్లాలో 100కు పైగా ఫైనాన్స్‌లు నడుస్తున్నాయి. అనధికారికంగా మరో 150 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. చిట్‌ఫండ్ల వ్యాపారం రూ.80 కోట్ల వరకు.. ఫైనాన్స్ వ్యాపారం రూ.70 కోట్ల వరకు జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్స్ నిర్వాహకులు అయితే తెల్ల పేపర్లపై లేకుంటే ఖాళీచెక్కులపై సంతకాలు చేయించుకుని 4 నుంచి 8 శాతం వడ్డీకి అప్పులిస్తున్నారు. పెద్ద ఎత్తున వడ్డీ వసూలు చేస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా చిట్స్‌ఫండ్ ఫైనాన్స్ కొనసాగిస్తున్నా.. వారిపై నిఘా కరువైంది.
చిట్స్‌ఫండ్స్ మోసాలు
జిల్లాలో ఉద్యోగులు, వ్యాపారులు, వైద్యులు, ఇతరత్రా వ్యక్తుల నుంచి లైసెన్స్‌డ్ చిట్స్‌ఫండ్ నిర్వాహకులు పెద్ద ఎత్తున చిట్టీలు వేయించుకొని కాలపరిమితి ముగిసినా డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఓ చిట్‌ఫండ్ కార్యాలయంలో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్‌ఫండ్స్ కంపెనీలో చిట్టీ తీసుకునే వారు ప్రభుత్వ ఉద్యోగితో ష్యూరిటీగా తీసుకొని డబ్బులు చెల్లిస్తారు. కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం చిట్స్‌ఫండ్ మోసాలకు దారితీస్తోంది. జిల్లాలో రిజిస్టర్ లేని చిట్టీలు కోట్ల వ్యాపారంలో కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కొందరు చిట్టీ నిర్వాహకులు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని పారిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
తాకట్టు వ్యాపారం
జిల్లాలో తాకట్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో చాలామంది డబ్బులు అవసరమున్న వారు వాహనాల పేపర్లతోపాటు బంగారం, భూమి కాగితాలు పెట్టి అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకుంటే తాకట్టు పెట్టిన వస్తువులను వ్యాపారులు అమ్ముకుంటున్నారు. చాలా మంది వడ్డీ వ్యాపారులు తెల్లపేపర్లపై స్టాంప్ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకుని ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. రిజిస్టర్డ్ అయిన చిట్‌ఫండ్స్ నిర్వాహకులు డిపాజిట్లు సేకరించి.. కాలపరిమితి ముగిసినా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా సుమారు ఏడు కంపెనీలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ఫలితంగా బాధితులు పోలీస్‌స్టేషన్‌లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
అనుమతుల్లేని ఫైనాన్స్‌లపై చర్యలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఫైనాన్స్‌లు, చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు చేపడతాం. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మూతపడిన చిట్‌ఫండ్స్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం.
– రఘుచందర్, డీఎస్పీ, జగిత్యాల

‘చీట్’ఫండ్ వ్యాపారం