
‘భూ భారతి’తో భూ సమస్యలు పరిష్కారం
కథలాపూర్: భూ భారతి చట్టంతో భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంతో అర్హులకే భూములు దక్కే అవకాశముందన్నారు. రికార్డుల్లో తప్పులు దొర్లితే త్వరగా సవరణ చేయొచ్చన్నారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ వినోద్, ఏఎంసీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పులి శిరీషా, ఏవో యోగితా, ఏఈవోలు హరీశ్, మౌనిక, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు అందేలా చూడాలి
జగిత్యాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అర్హత పరిశీలనపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని, ప్రతి నియోజకవర్గ గెజిటెడ్ స్పెషల్ అధికారులు మండలాల వారీగా కమిటీలు వేసి అవకతవకలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రెండున్నర ఎకరాలపైన వ్యవసాయ భూమి ఉండరాదని, కారు, ప్రభుత్వ ఉద్యోగం, వలస వెళ్లిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారు అనర్హులన్నారు. అదనపు కలెక్టర్ లత, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.