మా మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు : సీఎం జగన్‌ | AP CM YS Jagan comments in review of developments in Maoist affected states | Sakshi
Sakshi News home page

మా మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు : సీఎం జగన్‌

Published Tue, Aug 27 2019 4:18 AM | Last Updated on Tue, Aug 27 2019 8:34 AM

AP CM YS Jagan comments in review of developments in Maoist affected states - Sakshi

ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, హోం సెక్రటరీ అజయ్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, బిహార్‌ సీఎం నితీష్‌

సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి ద్వారానే సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం చూపించవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చని చెప్పారు. విద్య, వైద్యం, రహదారుల విస్తరణ, గిరిజనులకు భూములపై హక్కులు కల్పించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఉదారంగా సాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో సాగింది. ఈ సమావేశానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలు సూచనలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. 

మూడు నెలల్లోనే గణనీయమైన కార్యక్రమాలు
మానవ అభివృద్ధిని ఎజెండాగా చేసుకుని తమ పార్టీ వైఎస్సార్‌సీపీ రూపొందించిన మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారని, తమ పార్టీకి ఘన విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు సాగుతోందని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల కాలంలోనే అమలు చేసిన ముఖ్య కార్యక్రమాలను ఆయన వివరించారు. విభజన చట్టంలో భాగంగా కేంద్రం గిరిజన వర్శిటీని కేటాయించిందని, అయితే దాని ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏ ఒక్కరూ ఆలోచించని రీతిలో తాము ఒక వైద్య కళాశాలను గిరిజన ప్రాంతమైన పాడేరులో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీనికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీంతోపాటు ఒక ఇంజినీరింగ్‌ కళాశాల కూడా నిర్మిస్తున్నామని చెప్పారు.

ప్రతి ఐటీడీఏకు ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి
మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నందున మెరుగైన వైద్యం అందక గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా ప్రతి ఐటీడీఏకు ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తప్పకుండా ఏర్పాటు చేయాలని వైఎస్‌ జగన్‌ కోరారు. దీని కోసం ఏపీలో ప్రయత్నాలు ప్రారంభించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇవన్నీ అదనమని పేర్కొన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి ద్వారా శాంతిభద్రతలు వర్దిల్లుతాయని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాలు వేగంగా సాగాలంటే కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్‌ కళాశాల, వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని వివరించారు. మారుమూల ప్రాంతాలకు రహదారుల విస్తరణ, మొబైల్‌ టవర్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారుల విస్తరణకు సంబంధించి రావాల్సిన అనుమతుల గురించి నివేదించారు.

గిరిజనులకు భూములు ఇవ్వాలి
అటవీ ప్రాంతాల్లో భూ పట్టాల కోసం సుదీర్ఘ కాలంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకొచ్చారు. గిరిజనులకు వారి ఆవాస ప్రాంతాల్లోనే భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దీని కోసం తాజాగా దరఖాస్తులు ఆహ్వానించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో దాదాపు 1.41 లక్షల ఎకరాల అటవీ భూముల పట్టాలకు సంబంధించి 66 వేల దరఖాస్తులను నిరాకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత నాలుగు బెటాలియన్లను కేటాయించారని, వీటి ఏర్పాటుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే భరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మొదటి ఏడాదికి సంబంధించి మాత్రమే కేంద్రం నిధులు మంజూరు చేసిందని వివరించారు. 
కేంద్ర హోం శాఖ సమీక్ష అనంతరం అమిత్‌షాతో సీఎంలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, నితీష్‌కుమార్, ఆదిత్యనాథ్, కమల్‌నాథ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ తదితరులు 

కేంద్ర స్థాయిలో కోఆర్డినేషన్‌ కమిటీ!
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు జాతీయ స్థాయిలో ఒక కో ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేసేందుకు ఈ కమిటీ పని చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని పలు రాష్ట్రాలు కోరాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలు అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు సూచించాయి. రూ.50 లక్షల లోపు పనులను గిరిజనులకు నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వాలని, ప్రతి గ్రామంలో పోస్టల్, బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో చర్చించినట్టు సమాచారం. మొబైల్‌ టవర్ల ఏర్పాటుకు గల నిబంధనలను సరళీకరించాలని కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ గౌతం సవాంగ్‌లతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొన్నారు. 

అందరి ప్రయోజనాలకు అనుగుణంగా పోలవరంపై నిర్ణయం
పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటామని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు. ఇక్కడి శ్రమశక్తి భవన్‌లోని మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి 8.30 నుంచి రాత్రి 9.15 వరకు ఆయనతో సమావేశమయ్యారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్రం చెల్లించాల్సిన రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని, పునరావాసానికి సంబంధించిన నిధులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినట్టు నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లామని, ఈ ప్రక్రియ పూర్తవ్వగానే గడువును అనుసరించి చేపట్టే పనులకు నిధులను వెంటవెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. సమావేశం అనంతరం జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరంపై చర్చించాం. మేం ఏ నిర్ణయమైనా కేంద్ర, రాష్ట్ర, ప్రాజెక్టు ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకుంటాం’ అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటారా అని మీడియా ప్రశ్నించగా విషయ సంపూర్ణత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 

కేంద్ర హోం మంత్రితో వైఎస్‌ జగన్‌ సమావేశం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను ఆయన అధికారిక నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం కలిశారు. సాయంత్రం 6.40 నుంచి 7.30 వరకు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక పెండింగ్‌ అంశాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి హోం మంత్రికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇంటింటికీ తాగు నీరు, తదితర పథకాలకు కేంద్ర సాయం ఆవశ్యకతను విశదీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 13లో పొందుపరిచిన నిబంధనల మేరకు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్‌ జగన్‌ వెంట వైఎస్సార్‌పీపీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. 

మానవ అభివృద్ధిని అజెండాగా చేసుకుని వైఎస్సార్‌సీపీ రూపొందించిన మేనిఫెస్టోను గిరిజనులు విశ్వసించారు. అందుకే ఘన విజయం అందించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో గిరిజనుల అభివృద్ధికి మా ప్రభుత్వం అంకిత భావంతో ముందుకు సాగుతోంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement