మావో దంపతులు అనురాధ, రవిశర్మ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విప్లవ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు నార్ల రవి శర్మ, అతని భార్య అనురాధలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎల్‌బీ నగర్‌లోని మన్సూరాబాద్ వెంకటరమణ కాలనీలోని వీరి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. వారి నుంచి మావో యిస్టు సాహిత్యంతో పాటు మూడు ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి రాష్ట్రంలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాలతో వీరికి సంబంధం ఉందని 2012 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8(1)2, 1967 చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం తిరుమలపురం గ్రామానికి చెందిన రవి శర్మ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
సీపీఐ (ఎంఎల్) పీడబ్ల్యూజీలో పనిచేసే మేకల దామోదర్‌రెడ్డితో పరిచయం ఏర్పడటంతో జంట నగరాల్లో ఆ సంస్థల్లో సీవోగా పనిచేశారు. 1988లో ఆర్టీసీ బస్సుపై దాడి కేసులో సైఫాబాద్ ఠాణాలో వీరిపై కేసు నమోదైంది. మీర్‌చౌట్ ఠాణాలోనూ మరో కేసులో అరెస్టయి 1988 సెప్టెంబర్ 9న బెయిల్‌పై బయటకు వచ్చాడు. 1992–93లో హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్‌లో పనిచేశాడు. ఆ తర్వాత అజ్ఞాత కార్యకలాపాలు నిర్వహించాడు. 1998లో బిహార్, జార్ఖండ్‌లకు వెళ్లి పీపుల్స్ వార్ గ్రూప్‌ను అక్కడి పీయూతో విలీనం చేశాడు. 1999లో జార్ఖండ్ రాష్ట్రంలోని పాలమూ, లతేహర్‌లో జోనల్ కమిటీ మెంబర్‌గా, 2001లో బిహార్, జార్ఖండ్ స్టేట్ యాక్షన్ కమిటీ మెంబర్‌గా, 2003 నుంచి 2006 వరకు బిహార్ జార్ఖండ్ స్టేట్ యాక్షన్ కమిటీ మిలటరీ కార్యకలాపాలను చూసుకున్నాడు. బిహార్‌లోని బీమ్‌బంద్ అడవిలో జరిగిన తొమ్మిదో కాంగ్రెస్‌కు హజరై భద్రతా చర్యలను పర్యవేక్షించాడు. ఆ తర్వాత నుంచి మావోయిస్టు పార్టీలోని సభ్యులకు వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తూ వచ్చాడు. ఇలా ఒకసారి పోలీసులకు చిక్కిన రవి శర్మ 2016 ఏప్రిల్ 4న బెయిల్‌పై బయటకు వచ్చాడు. తరచూ ఛత్తీస్‌గఢ్‌లో అగ్రనేతల సమావేశాలకు హజరవుతూ వస్తున్నాడు.
రవి శర్మపై 16 కేసులు..
2018 జూలై 21 నుంచి ఆగస్టు 6 వరకు రవి శర్మ దండకారుణ్యానికి వెళ్లాడు. 2018 నవంబర్‌లో కోల్‌కత్తాలో సెంట్రల్ కమిటీ మాజీ సభ్యులను, 2019 మార్చిలో హైదరాబాద్‌లో వారణాసి సుబ్రహ్మణ్యంను కలిశాడు. ఢిల్లీలో 2019 ఫిబ్రవరిలో జరిగిన హిందుత్వ ఫాసిస్టు అఫెన్సివ్‌కు వ్యతిరేకంగా ఆలిండియా ఫోరమ్ ఏర్పాటులో చురుగ్గా పాల్గొన్నాడు. రవి శర్మ పోలీసులకు లొంగిపోయినప్పటి నుంచి కూకట్‌పల్లిలో నివసించే అతని సోదరుడు ప్రకాశ్ శర్మ ఇంటి వద్ద ఉండేవాడు. రవి శర్మ తల్లిదండ్రులు సుధాకర శర్మ, సులోచనతోపాటు సోదరి శ్రీదేవి కూడా ఉండేవారు. మన్సూరాబాద్‌లోని వెంకటరమణ కాలనీలో సుధాకర శర్మ సోదరుడి కుమారుడు రాజేష్ కుమార్‌కు రెండంతస్థుల భవనం ఉంది.
సుధాకర శర్మకు విశాలాంధ్ర కాలనీలో 230 గజాల ప్లాటు ఉంది. ఈ ప్లాటులో ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఆరు నెలల క్రితం రవి శర్మ రాజేష్ కుమార్ ఇంట్లోకి దిగాడు. విషయం తెలుసుకున్న ప్రత్యేక పోలీసులు.. ఎల్‌బీ నగర్ పోలీసుల సహకారంతో రవి శర్మ ఇంటిపై దాడి చేశారు. దంపతులిద్దరినీ అరెస్టు చేశారు. రవి శర్మపై జార్ఖండ్‌లో 11, హైదరాబాద్‌లో 4, విశాఖపట్నం రూరల్ చింత పల్లిలో ఒక కేసు.. మొత్తం 16 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో జార్ఖండ్ బోకారా జిల్లా తెనుఘాట్‌లో ఒక కేసు పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం రవి శర్మ పక్క పోర్షన్‌లోకి హిందీ భాష మాట్లాడే దంపతులు అద్దెకు దిగారని తెలుస్తోంది. వారు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment