
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య పెరుగుతోందని, దీని కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. మావోయిస్టుల చర్యల మీద దృష్టి సారించాలన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. మావోయిస్టులు విస్తరిస్తే కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు.
ఇటీవల తాము ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సందర్భంలో మావోయిస్టుల ప్రాబల్యం దృష్ట్యా తమ వాహనాలను మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారని గుర్తుచేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌కు ఆర్థిక సాయం పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.