2022లో ఏవోబీ నుంచి ఛత్తీస్‌గఢ్ తరలివెళ్లిన మావోలు
రెండేళ్లుగా ఏవోబీలో కార్యకలాపాలు బంద్
తిరిగి ఏవోబీలోకి వెళ్లాలని మావోయిస్ట్ పార్టీ ఆదేశం
రెండేళ్ల తరువాత ఏవోబీలో మావోల కదలికలు
పోలీసు శాఖను అప్రమత్తంచేసిన కేంద్ర నిఘా వర్గాలు
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్ట్‌ల కదలికలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. 2022లో ఏవోబీ నుంచి మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు తరలివెళ్లిన మావోయిస్ట్ నేతలు ఏవోబీకి తిరిగొస్తున్నారు. ఏవోబీలో కార్యకలాపాలు విస్తరించాలన్న మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు వారు తిరిగొస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు శాఖను ఇప్పటికే అప్రమత్తం చేశాయి.
2022లో ఏవోబీని విడిచిపెట్టి..
రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో పోలీసు శాఖ సమర్థ పనితీరుతోపాటు గిరిజన ప్రాంతాల్లో భారీ స్థాయిలో సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టింది. ఏవోబీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగును ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా నిర్మూలించింది. మావోయిస్ట్ కార్యకలాపాల్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేసింది.
ఏవోబీలో 20 ఏళ్లపాటు కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్ట్‌లు దాదాపు పూర్తిగా పట్టుకోల్పోయారు. ఒకప్పుడు 500 మంది నేతలు, 1,500 మంది మిలీషియా సభ్యులతో పోలీసులకు సవాల్ విసిరిన మావోయిస్ట్ పార్టీ బలం పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం 20 మంది నేతలు, 100 మంది మిలీషియా సభ్యులకు పరిమితమైపోయింది. వారిలో కూడా క్రియాశీలంగా కేవలం 50 మంది మాత్రమే మిగిలారు.
ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అప్రమత్తమై మిగిలి ఉన్న మావోయిస్ట్ నేతలు, క్రియాశీల నేతలను మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులకు తరలివెళ్లాలని ఆదేశించింది. ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌తోపాటు ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాలకు 2022 చివరిలో తరలివెళ్లిపోయారు. అప్పటినుంచి రెండేళ్లుగా ఏవోబీలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
బ్యాక్ టు ఏవోబీ
ఇటీవల కాలంలో మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌లలో ఆ రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లతో విరుచుకుపడుతున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా 287 మంది మావోయిస్ట్‌లు ఎన్‌కౌంటర్లలో హత మవ్వగా.. వెయ్యి మందికిపైగా అరెస్టయ్యారు. వారిలో 190 మంది ఛత్తీస్‌గఢ్‌లోనే హతమవ్వడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు ఇక ఏమాత్రం సురక్షిత స్థానం కాదని చెబుతూ ఏవోబీకి చెందిన 20 మంది మావోయిస్ట్ నేతలతోపాటు మొత్తం 50 మంది మావోయిస్ట్‌లను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. దాంతో మావోయిస్ట్ నేతలు దశలవారీగా ఏవోబీలోకి వస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.
రాష్ట్ర పోలీసు శాఖను ఈ విషయంపై అప్రమత్తం చేశాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని దాదాపు 20 మండలాల్లో మావోయిస్ట్‌లు, మిలీషియా సభ్యుల కదలికలు మెల్లగా ఊపందుకున్నట్టు రాష్ట్ర పోలీసు శాఖ గుర్తించింది. మావోయిస్ట్‌ల కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment