సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు.
పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర..
పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు.
ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు.
యాప్ ద్వారా డేటా సేకరణ..
వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది.
శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి..
అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం.
– రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment