పోలీసు పతకాలూ విభజన!
- ఉగాది పతకాలపై ఉత్కంఠ
- ఎవరు ప్రదానం చేస్తారో తెలియక తికమక
- ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజు
- ఇప్పుడు ఇచ్చేది ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రభావం పోలీసు పతకాల ప్రదానంపైనా పడింది. ఉగాది పండగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను ఎవరు? ఎప్పుడు? అందిస్తారనేది అవి దక్కించుకున్నవారికి అర్థం కావట్లేదు. ఈ జాబితాను ప్రకటిస్తూ మార్చి నెలాఖరులో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లోనూ వీటిపై ఎలాంటి ప్రస్తావనా లేదు. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులూ దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పతకాలను కూడా విభజించి రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత రెండు ప్రభుత్వాలు అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి ఎప్పుడ అందిస్తారనే దానిపై పతకాలు పొందిన వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
పోలీసు శాఖలో ఉత్తమ పనితీరు, ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయిలో ఏటా నాలుగుసార్లు పతకాల ప్రకటన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రెసిడెంట్ పోలీసు మెడల్ (పీపీఎం), రాష్ట్రపతి గ్యాలెంటరీ మెడల్ (పీఎంజీ), ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎమ్)లను ప్రతి ఏటా గణతంత్రదినం, స్వాతంత్య్ర దినాల్లో ప్రకటిస్తారు. రిపబ్లిక్ డేకు ప్రకటించిన వాటిని ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డేకు ప్రకటించిన వాటిని రిపబ్లిక్ డే నాడు ప్రదానం చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉగాది, రాష్ట్రావతరణదినం సందర్భాల్లో పోలీసు పతకాలు ప్రకటిస్తారు. వీటిని నవంబర్ 1న రాష్ట్రావతరణ వేడుకల్లో అందిస్తారు. ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ కలిపి 309 మందికి వివిధ పతకాలు దక్కాయి.
ముఖ్యమంత్రి శౌర్య పతకం, మహోన్నత సేవా పతకాలను మాత్రమే రాజధానిలో జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తారు. అయితే విభజన నేపథ్యంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగే అవకాశం లేదు. ఏ రాష్ట్రానికి చెందిన వారికి ఆ రాష్ట్రంలోనే, ఆ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఈ పతకాలు దక్కించుకున్న వారి జాబితాను కూడా విభజించాల్సి ఉంటుంది.
అపాయింటెడ్ డే జూన్ 2న ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో ఎప్పుడు? ఎక్కడ ఇవ్వాలనేది ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. అలా కాని పక్షంలో ఆగస్టు 15న ఉమ్మడి రాజధానిలో, ఉమ్మడి గవర్నర్ చేతుల మీదుగా ఇప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పతకాల్లో ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం, పోలీసు సేవా పతకాలు పొందిన వారికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీటిని ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి చేతుల మీదుగా అందిస్తారు. వీరు కేవలం ఎప్పుడు అందించాలనేది నిర్ణయించుకుంటే సరిపోతుంది.