సంబురాలు చేసుకుంటున్న పోలీసులు
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నాలుగు రోజులుగా భయానక వాతావరణం నెలకొంది. దేశ చరిత్రలోనే ఒకేసారి రెండు ఎన్‌కౌంటర్లలో 37 మంది మావోయిస్టులు నేలకొరిగారు. తాజాగా బుధవారం ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. దీంతో గడ్చిరోలి ఎన్‌కౌంటర్ల మృతుల సంఖ్య 39కి చేరింది. ఈ నెల 22న ఆదివారం ఉదయం గడ్చిరోలి జిల్లాలోని బామ్రాగఢ్ తాలూకా కస్నాగూడ అటవీ ప్రాంతంలోని బోరియా ప్రదేశంలో మావోయిస్టులపై పక్కా సమాచారంతో సీ–60 పోలీసులతోపాటు మరో ఐదు కంపెనీల పోలీసు బలగాలు ముప్పేట దాడికి దిగాయి.
ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మృతదేహాలు మరుసటిరోజు ఇంద్రావతినదిలో తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని గడ్చిరోలి జిల్లా ఆస్పత్రికి హెలికాప్టర్‌లో తరలించారు. ఈ నెల 23న గడ్చిరోలి జిల్లాలోని అహేరి తాలూ కాలోని రాజారాంఖాండ్ల పరిధిలోని జిమ్మటగట్టుపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతుల సంఖ్య మొత్తం 37గా పోలీసులు ప్రకటించారు. ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలు బయటపడటంతో మృ తుల సంఖ్య 39కి చేరింది. మృతుల్లో ఇప్పటి వరకు 20 మంది మహిళలు, 19 మంది పురుషులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
గడ్చిరోలిలో పోలీసుల సంబురాలు
దేశ చరిత్రలోనే భారీ ఎన్‌కౌంటర్ చేసిన సీ–60 పోలీసులు, ఇతర పోలీసులు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సంబురాలు చేసుకుంటున్నాయి.
పేట్రేగుతున్న రాజ్యహింస: వరవరరావు
చిట్యాల(భూపాలపల్లి): దేశంలో రాజ్యహింస పేట్రేగిపోతోందని విరసం నేత వరవరరావు అన్నారు. గడ్చిరోలిలో ఈ నెల 22న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడు రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ మృతదేహం మంగళవారం అర్ధరా త్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తనస్వగ్రామం చల్లగరిగెకు తరలించారు. బుధవారం విరసం నేత వరవరరావు అక్కడికి చేరుకుని విజేందర్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్ బూటకమని, ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏకపక్షంగా కాల్పులు జరిపి నలుగురు డివిజన్ కార్యదర్శులుసహా 37 మందిని పొట్టనబెట్టుకున్న రాక్షస ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ గ్రేహౌండ్స్ హస్తం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment