ఏవోబీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలు
పాడేరు: ఏవోబీలో యుద్ధవాతావరణం నెలకొంది. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనల్లో మావోయిస్టులు తప్పించుకోవడంతో వారి కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఏక్షణంలో ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీ లండులు, మెట్టగుడ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారాన్ని గుర్తించిన పోలీసు పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఆదివారం ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు తప్పించుకున్నారు. తుపాకీలు, కిట్ బ్యాగులను వదిలి తప్పించుకున్నట్టు తెలిసింది.ఈ ఎదురు కాల్పుల్లో ఇరు వర్గాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.
తప్పించుకున్న వారికోసం ఏవోబీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ నెల 16న ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా బలిమెల కటాఫ్ ఏరియాలోని ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో ఒడిశా డీవీఎఫ్, ఎస్‌వోజీ బలగాలు, విశాఖ జిల్లా పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో తారసపడిన మావోయిస్టు దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇరు పారీ్టల మధ్య 15 నిమిషాల పాటు కాల్పులు జరిగినప్పటికీ ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
ఎప్పటికప్పుడు సమీక్ష
ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో సమీక్షిస్తున్నారు. విశాఖ ఏజెన్సీతో పాటు సరిహద్దులోని ఒడిశా అటవీ ప్రాంతాల్లో ఇరురాష్ట్రాల పోలీసులు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని పోలీసులు, మావోయిస్టులు గతంలో ప్రకటించారు. అయితే ఇటీవల మావోయిస్టు పార్టీ ఏవోబీలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయడంతో పాటు ఎక్కడికక్కడ గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తూ కొత్త రిక్రూట్‌మెంట్‌ను చేపడుతోందనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
ఏవోబీ వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. విశాఖ ఏజెన్సీకి సరిహద్దులో ఉన్న మల్కన్‌గిరి, కోరాపుట్టు జిల్లాలకు చెందిన పోలీసు పార్టీలు అటువైపు నుంచి కూంబింగ్ నిర్వహిస్తుండగా.. విశాఖ ఏజెన్సీ పోలీసుపారీ్టలు జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్‌ను విస్తృతం చేశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment