రాయ్‌పూర్ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పైగా అక్కడి ప్రభుత్వానికి కూడా అధికారాలు తక్కువ. మావోల ప్రభావం కలిగిన ఛత్తీస్‌గఢ్‌లోని అబూజాబాద్ ప్రాంతంలో కీర్టా డోప్రా అనే గిరిజన యువతి మెడికల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. వీరికి ప్రాథమిక సదుపాయాలు, రోడ్డు మార్గాలు లేవు. రోజు మొత్తమ్మీద నాలుగు బస్సులు మాత్రమే ఇక్కడికి వస్తాయి. ప్రతి బుధవారం ఇక్కడ కూరగాయల సంత జరుగుతుంది.
మావోయిస్టుల తిరుగుబాటు నేపథ్యంలో జన్ ఔషధీ కేంద్రం మాత్రమే ఔషధాలను అందజేస్తోంది. ఇక్కడ ఈ వెసులుబాటు లేకపోతే ఔషధాలకోసం 70 కిలో మీటర్లు వెళ్లక తప్పదు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా మరియా తెగకు చెందిన కీర్టా చదువు ఇంటర్‌తోనే ఆగిపోయింది. ఒక రోజు ఈ గ్రామంలో యూనిసెఫ్ సంస్థ పోషకాహారలోపంపై కార్యక్రమం నిర్వహించగా కీర్టా అందులో పాల్గొని అందరికీ అవగాహన కల్పించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంత సమస్యలను యూనిసెఫ్ సంస్థ దృష్టికి తీసుకుపోయింది. వారి సహకారంతో మలేరియా, డయేరియాతోపాటు అన్నిరకాల మందులను గ్రామస్థులకు అందుబాటులో ఉంచుతోంది.
అలా ఆమె రోజుకు 12 గంటలు పనిచేసి నెలకు రూ.2,000పైగా సంపాదిస్తోంది. కీర్టా తెగువను గుర్తించిన యూనిసెఫ్ సంస్థ 2014లో సాహసి అవార్డుతో సన్మానించింది. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ‘‘ మావోయిస్టులు ఏ క్షణంలోనైనా ఆ షాపుపై దాడి చేయవచ్చు. ధ్వంసం కూడా చేయొచ్చు. అయితే కీర్టా అవేవీ పట్టించుకోలేదు. ఆమె ధైర్యం అందరికీ ఆదర్శం. ఇటువంటివారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment