హైదరాబాద్, సాక్షి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్‌కౌంటర్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కూడా భార్య ఐలమ్మకు అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం(నవంబర్ 6) మధ్యాహ్నాంలోగా అప్పగింత పూర్తి చేయాలని.. మృతదేహంపై గాయాలుంటే గనుక ఫొటోలు, వీడియోలు తీయాలని స్పష్టం చేసింది.
ఏటూరునాగారం మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గత విచారణలో.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల్లో ఈగోలాపు మల్లయ్య అలియాస్ మధు తప్ప మిగిలిన ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. మల్లయ్య మృతదేహం అప్పగించకపోవడంతో.. భార్య ఐలమ్మ అలియాస్ మీనా హైకోర్టును ఆశ్రయించారు.
గత విచారణలో.. ‘‘ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, మావోయిస్టులు తినే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి చిత్రహింసలు పెట్టి చంపారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ కుమార్. అలాగే.. శవ పంచనామాలో కుటుంబసభ్యులను అనుమతించలేదని, పోస్ట్‌మార్టం ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జరగలేదని పేర్కొన్నారు. మల్లయ్య మృతదేహాన్ని చూడటానికి ఐలమ్మను కేవలం 10 నిమిషాలే అనుమతించారని, ఈ కొద్ది సమయంలోనే ఆమె తన భర్త మృతదేహంపై దాదాపు 11 గాయాలను గుర్తించారని తెలిపారు. శవ పంచనామాకు పిటిషనర్‌ను అనుమతించలేదన్నారు. ఎన్‌హెచ్చార్సీ మార్గదర్శకాల ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శవ పంచనామా జరిపించేలా ఆదేశించాలని కోరారు. ఇది ఎన్‌కౌంటర్ కాదని.. కస్టోడియల్ డెత్ అని ఆరోపించారు.
వాదనలు నమోదు చేసుకున్న విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె భర్త మల్లయ్య మృతదేహం తప్ప మిగితావాళ్లవి వారి బంధువులు అడిగితే అప్పగించాలని స్పష్టం చేసింది. పోస్ట్‌మార్టం ఎగ్జామినేషన్, శవపంచనామా నిర్వహణలో అనుసరించిన విధానంపై సంక్షిప్త వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఇవాళ.. మృతదేహం అప్పగింతపై ఆదేశాలిచ్చింది.
చల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మరణించిన ఘటనపై కలెక్టర్ దివాకర ఇదివరకే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ములుగు ఆర్డీవో వెంకటేశ్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment