సాక్షి,హైదరాబాద్ : ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6.15 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని ఆయన తెలిపారు.
అయితే, చెల్పాక ఎన్‌కౌంటర్‌పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పౌరహక్కుల సంఘం పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి ప్రాణలు తీసినట్లు తెలిపారు.
మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది..ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు.
అయితే, అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని,ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్ర పర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ భద్రపరిచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment