
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కొత్త అసిస్టెంట్ కోచ్‌ను (Assistant Coach) నియమించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన 51 ఏళ్ల మథ్యూ మాట్ (Matthew Mott) డీసీ కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటరైన మాట్.. వివిధ జాతీయ జట్ల హెడ్ కోచ్‌గా పలు వరల్డ్‌కప్‌లు గెలిచాడు.
2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ పురుషుల జట్టుకు మాట్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా మహిళల జట్టు హెడ్ కోచ్‌గా మాట్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మాట్ 2015-2022 మధ్యలో ఆసీస్ మహిళా టీమ్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ మధ్యకాలంలో ఆసీస్ ఓసారి వన్డే వరల్డ్‌కప్.. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. దీని తర్వాత మాట్ ఇంగ్లండ్ పురుషుల జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.
మాట్ ఇంగ్లండ్‌ను 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిపించినప్పటికీ.. అతని హయాంలో ఇంగ్లండ్ 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఫలితంగా మాట్ తన పదవీకాలం మధ్యలోనే ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనంతరం మాట్ సిడ్నీ సిక్సర్స్ అసిస్టెంట్ కోచ్‌గా మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
తదుపరి ఐపీఎల్ సీజన్‌లో మాట్ ఢిల్లీ క్యాపిటల్స్ నూతన హెడ్ కోచ్ హేమంగ్ బదానీతో కలిసి పని చేస్తాడు. డీసీ యాజమాన్యం బౌలింగ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్, భారత మాజీ పేసర్ అయిన మునాఫ్ పటేల్‌ను ఇటీవలే నియమించుకున్న విషయం తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు డీసీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తాడు.
కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రారంభం నుంచి వేర్వేరు పేర్లతో లీగ్‌లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తొలి రెండు సీజన్లలో సెమీస్‌కు చేరిన ఈ జట్టు.. 2020 సీజన్‌లో అత్యుత్తమంగా ఫైనల్స్‌కు చేరింది. ఆ సీజన్ ఫైనల్లో డీసీ ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. మూడు సీజన్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది.
తదుపరి సీజన్ కోసం ఢిల్లీ జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. పాత ఆటగాళ్లను దాదాపుగా వదిలించుకుని కొత్త ఆటగాళ్లను తీసుకుంది. మెగా వేలానికి ముందు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌ను రీటైన్ చేసుకుంది. కెప్టెన్ రిషబ్ పంత్ సహా ఆసీస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లను వదిలేసింది.
మెగా వేలంలో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, టి నటరాజన్, డుప్లెసిస్ లాంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలంలో డీసీ యాజమాన్యం అత్యధికంగా 14 కోట్లు వెచ్చింది కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకుంది. తదుపరి సీజన్ కోసం డీసీ మేనేజ్‌మెంట్ తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు.
2025 సీజన్ కోసం ఢిల్లీ జట్టు..
కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, హ్యారీ బ్రూక్, అషుతోశ్ శర్మ, డుప్లెసిస్, సమీర్ రిజ్వి, కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనోవన్ ఫెరియెరా, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, మాధవ్ తివారి, మన్వంత్ కుమార్, త్రిపురుణ విజయ్, అజయ్ మండల్, మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment