
‘‘ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడించగల సత్తా మా జట్టుకు ఉంది. చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం’’... ఐసీసీ టోర్నమెంట్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో(Najmul Hossain Shanto) చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే, ఈ వన్డే ఈవెంట్ ఆరంభమైన ఆరు రోజుల్లోనే.. లీగ్ దశలోనే బంగ్లాదేశ్ ప్రయాణం ముగిసిపోయింది.
గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత టీమిండియా చేతిలో ఓడిన షాంటో బృందం.. సోమవారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్(Bangladesh Vs New Zealand) జట్టు చేతిలోనూ ఓటమిని చవిచూసింది. తద్వారా సెమీస్ కూడా చేరుకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బ్యాటర్ల వైఖరిని ఎండగట్టాడు.
పదే పదే అవే తప్పులు..
‘‘గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని పదే పదే చెప్పాను. కానీ మేము మళ్లీ అదే రిపీట్ చేస్తున్నాం. బ్యాటింగ్ విభాగంలో మేము మెరుగుపడాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ తర్వాత కచ్చితంగా బ్యాటింగ్ యూనిట్‌లో మార్పులు ఉంటాయి.
బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది. కానీ గత రెండు మ్యాచ్‌లలోనూ అలా జరుగలేదు. ఓడిన ప్రతిసారీ సిబ్బందిపై వేటు వేయడం, మార్చడం చేయలేము. ఆటగాళ్లు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి.
ఓటమిని తేలికగానే అంగీకరిస్తున్నట్లుగా ఉంది
ఇప్పటికే చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చాము. అయినా.. ప్రతిసారి మేము ఓటమిని తేలికగానే అంగీకరిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇకపై మేము మరింత జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది’’అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో నజ్ముల్ షాంటో పేర్కొన్నాడు.
ఇక కివీస్ మ్యాచ్‌లో తమ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ‘‘మాకు శుభారంభమే లభించింది. కానీ మిడిల్ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయాం. మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. నిజానికి పిచ్ బ్యాటింగ్‌కు సహకరించింది. అయినా.. భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం.
పాక్‌పై గెలిచి విజయంతో ముగిస్తాం
అయితే, మా బౌలింగ్ పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. గత రెండేళ్లుగా మా బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఇక లీగ్ దశలో మాకు మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. పాకిస్తాన్‌పై గెలిచి విజయంతో ఇంటిబాట పట్టాలని పట్టుదలగా ఉన్నాం.
ఏదేమైనా మేమైతే బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మెరుగుపడాల్సి ఉందని కచ్చితంగా చెప్పగలను’’ అని షాంటో అన్నాడు. కాగా రావల్పిండిలో సోమవారం కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఇక టీమిండియా, న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లలో బంగ్లా గట్టి పోటీనిచ్చిప్పటికీ.. దానిని విజయంగా మలచుకోలేకపోయింది. ఇక నజ్ముల్ షాంటో భారత్‌తో మ్యాచ్‌లో డకౌట్ కాగా.. కివీస్‌తో మ్యాచ్‌ల మాత్రం అర్ధ శతకం(77)తో రాణించాడు. మిగతా వాళ్లలో జాకిర్ అలీ(68, 46), తౌహీద్ హృదోయ్(భారత్‌పై శతకం) మాత్రమే మెరుగ్గా ఆడారు.
కాగా గ్రూప్ దశలో ఆఖరిగా గురువారం(ఫిబ్రవరి 27) రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. బంగ్లా మాదిరే ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడి నిష్క్రమించిన పాక్.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.
చదవండి: Aus vs SA: కీలక మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ఒకవేళ రద్దైతే..!