
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్ జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడకు వెళ్లింది. తొలి రెండు టీ20లలో ఓటమి పాలైన సల్మాన్ ఆఘా బృందం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. మరోవైపు.. ఈ టూర్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీ కానున్నారు.
అనంతరం.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్‌లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ టూర్ (Bangladesh Tour Of Pakistan) లో భాగంగా పాక్- బంగ్లా జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేలు జరుగుతాయి.
ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 10వ సీజన్ జరగనుండగా... ఇది ముగిసిన అనంతరం బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది.
ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. లాహోర్ (Lahore), ముల్తాన్ (Multan), ఫైసలాబాద్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ పాకిస్తాన్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అతడితో చర్చించిన.. అనంతరం ఇరు దేశాల బోర్డులు ఈ సిరీస్‌లకు పచ్చజెండా ఊపాయి. ద్వైపాక్షిక సిరీస్ కోసం చివరిసారిగా గతేడాది పాకిస్తాన్‌లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు.. బంగ్లాదేశ్ కూడా ఘోర ఓటములు చవిచూసింది. గ్రూప్-ఎలో టీమిండియా, న్యూజిలాండ్‌తో కలిసి ఉన్న ఈ ఆసియా జట్లు.. ఈ రెండు టీమ్‌ల చేతిలో చిత్తుగా ఓడాయి.
అనంతరం పాక్- బంగ్లా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం అడ్డుపడటంతో టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో చెరో పాయింట్‌తో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాయి.
ఇక గ్రూప్-బి నుంచి చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ తలపడ్డాయి. ఇందులో సౌతాఫ్రికా సెమీస్ చేరి.. అక్కడ కివీస్ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో రోహిత్ సేన జయకేతనం ఎగురువేసింది. ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా అవతరించింది.
చదవండి: వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్
Comments
Please login to add a commentAdd a comment