
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్, మాజీ విజేత పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. స్థానిక కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 9 గంటల 10 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.40 నుంచి) ప్రారంభం కావాల్సింది. అయితే మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది. గంటన్నరపాటు వేచి చూసినా... వర్షం తగ్గకపోవడంతో నిర్వాహకులు ఫైనల్‌ను రద్దు చేసి భారత్, పాకిస్తాన్ లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.