క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
బర్మింగ్‌హామ్: భారత్, పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్త. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ జునైద్ ఖాన్ ఆడడం లేదు. కోహ్లిని సవాల్ చేసిన అతడు ఈరోజు మ్యాచ్‌లో ఉండుంటే పోటీ రసవత్తరంగా సాగేది. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అయినప్పటికీ తన దెబ్బకు నిలవలేడని టోర్నీ ప్రారంభానికి ముందు జునైద్ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి-జునైద్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని భావించారు. వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలని అభిమానులు ఆశ పడ్డారు. అనూహ్యంగా జునైద్‌కు 12 మంది సభ్యుల పాక్ టీమ్‌లో చోటు దక్కలేదు.
గతంలో నాలుగు మ్యాచుల్లో జునైద్ బౌలింగ్‌లో కోహ్లి మూడుసార్లు అవుటయ్యాడు. 22 బంతులను ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేకాదు వన్డేలో కోహ్లికి జునైద్ 21 డాట్ బంతులు సాధించాడు. జునైద్‌ను తప్పించడాన్ని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సమర్థించుకున్నాడు. ‘నాలుగేళ్ల క్రితం కోహ్లిని జునైద్ అవుట్ చేసిన మాట నిజమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీనికి అనుగుణంగా జట్టును ఎంపిక చేశాం. ఇప్పున్న బౌలర్లు కూడా కోహ్లి వికెట్ తీయగలర’ని సర్ఫరాజ్ తెలిపాడు.