బంగ్లాదేశ్ లక్ష్యం 266
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం ఇక్కడ బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(57; 69 బంతుల్లో 5 ఫోర్లు),రాస్ టేలర్(63;82 బంతుల్లో 6 ఫోర్లు) మినహా పెద్దగా ఎవరూ రాణించకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితం కావాల్సివచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆద్యంతం తడబాటునే కొనసాగించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ కు మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీలు దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే రోంచీ(16), గప్టిల్(33)లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో న్యూజిలాండ్ 69 పరుగులకే ఓపెనర్ల వికెట్లను నష్టపోయింది. ఆ దశలో కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతంగా ఆడాడు. రాస్ టేలర్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ క్రమంలోనే ముందుగా విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై టేలర్ కూడా అర్థ శతకం సాధించాడు.
కాగా, జట్టు స్కోరు 152 పరుగుల వద్ద విలియమ్సన్ మూడో వికెట్ అవుటవ్వగా, 201 పరుగుల వద్ద టేలర్ పెవిలియన్ బాటపట్టాడు. వీరిద్దరూ నిష్ర్రమించిన తరువాత న్యూజిలాండ్ స్కోరు మరింత మందగించింది. అయితే ఆల్ రౌండర్ నీషమ్(23) కాస్త ఫర్వాలేదనిపించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ స్పిన్నర్ మొసాదక్ హుస్సేన్ మూడు వికెట్లు సాధించి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్టవేశాడు. అతనికి తస్కీన్ అహ్మద్ రెండు వికెట్లతో చక్కటి సహకారం అందించాడు.