రెండో ఫైనల్ బెర్త్ ఎవరిదో?
బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ బెర్త్ కు రంగం సిద్ధమైంది. గురువారం బంగ్లాదేశ్ తో జరిగే సెమీస్ పోరులో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించిన పాకిస్తాన్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, భారత్-బంగ్లాదేశ్ జట్లు రెండో సెమీస్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లి సేన ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. బలాబలాలపరంగా చూస్తే భారత్‌దే అన్నింటా పైచేయిగా కనిపిస్తోంది.
ఓపెనింగ్, మిడిలార్డర్, అనుభవం... ఇలా అన్నింటా బంగ్లాదేశ్ జట్టు ఎదురు నిలిచే పరిస్థితి లేదు. అయితే బౌలింగ్‌లో మాత్రం మన కుర్రాళ్లతో బంగ్లా ఆటగాళ్లు కూడా పోటీ పడుతున్నారు. ఇక పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా ఆ జట్టు ఆడితే మరో సంచలనానికి అవకాశం ఉంటుంది. అన్నట్లు 2015 ప్రపంచ కప్ తర్వాత టాప్–8 జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ 11 గెలిచి, 13 ఓడితే... బంగ్లాదేశ్ కూడా 11 గెలిచి, 10 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. మరొకవైపు ఇరు జట్ల ఓవరాల్ ముఖాముఖి పోరులో భారత్ 26 విజయాలు సాధించగా,బంగ్లాదేశ్ ఐదు సార్లు గెలుపొందింది.ఇదిలా ఉంచితే, ఇరు జట్లు తలపడిన చివరి నాలుగు గేమ్ల్లో తలో రెండు మ్యాచ్ లు గెలిచి సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. గ్రూప్ స్టేజ్ లోదక్షిణాఫ్రికాతో ఆడిన జట్టునే భారత్ కొనసాగించనుంది.
బంగ్లాదేశ్ తుది జట్టు: మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్,షబ్బిర్ రెహ్మాన్, ముష్ఫికర్ రహీమ్,షకిబుల్ హసన్,మొహ్మదుల్లా, మొసడెక్ హుస్సేన్, రూబేల్ హుస్సేన్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్,హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్,భువనేశ్వర్ కుమార్,బూమ్రా