హార్దిక్ ఎంత పనిచేశాడు..!
బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఏడో ఓవర్ ఐదో బంతికి మరో వికెట్ ను నష్టపోయింది. ఈ రెండు వికెట్లు భువనేశ్వర్ ఖాతాలోనే చేరడం విశేషం. అయితే 13 ఓవర్లో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కు లైఫ్ వచ్చింది. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్ ఐదో బంతిని వికెట్లపైకి ఆడకున్న తమీమ్ బౌల్డ్ అయ్యాడు.
కాగా, అదే నో బాల్ గా తేలింది. హార్దిక్ పాండ్యా లైన్ కు ముందుకొచ్చినట్లు రిప్లేలో కనబడటంతో తమీమ్ బతికిపోయాడు. అప్పటికి తమీమ్ స్కోరు 15. బంగ్లా కీలక ఆటగాడైన తమీమ్ విషయంలో ఇలా జరగడం భారత్ అభిమానుల్ని నిరాశకు గురిచేసింది. హార్దిక్ ఎంత పని చేశాడు అంటూ అభిమానులు తలలు పట్టుకున్నారు. ఆ తరువాత తమీమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో నాలుగు ఫోర్లు, 1 సిక్సర్ తో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆపై 82 బంతుల్లో 70 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించిన తరువాత కేదర్ జాదవ్ బౌలింగ్ లో తమీమ్ మూడో వికెట్ గా అవుటయ్యాడు. అయితే విలువైన పరుగులు తమీమ్ సాధించడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరొకవైపు బంగ్లాదేశ్ ఆదిలో వికెట్ల కోల్పోయినా రన్ రేట్ ను కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. బంగ్లాదేశ్ 30 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.