టీమిండియా లక్ష్యం 265
బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 265 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(70;82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ రహీమ్(61;85 బంతుల్లో 4 ఫోర్లు) అర్థ శతకాలతో రాణించి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో సౌమ్య సర్కార్(0) వికెట్ ను కోల్పోయింది. ఆపై ఫస్ట్ డౌన్ ఆటగాడు షబ్బిర్ రెహ్మాన్(19)ను కూడా నిరాశపరచడంతో బంగ్లాదేశ్ 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి రెండు వికెట్లను సాధించి బంగ్లాకు షాకిచ్చాడు. అయితే ఆ తరుణంలో తమీమ్ కు జత కలిసిన రహీమ్ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు.
ఈ జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనించింది. కాగా, తమీమ్ అవుటైన తరువాత షకిబుల్ హసన్(15), ముష్ఫికర్ రహీమ్ లు కూడా పెవిలియన్ చేరండంతో బంగ్లాదేశ్ స్కోరులో వేగం తగ్గింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు మొహ్మదుల్లా(21),మొసడక్ హుస్సేన్(15), మోర్తజా(30 నాటౌట్), తస్కీన్ అహ్మద్(11నాటౌట్) లు బ్యాట్ ఝుళిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,బూమ్రా, కేదర్ జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది.