పసలేని టీమిండియా బౌలింగ్
లండన్: చాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. పాకిస్తాన్ ఓపెనర్లు అజహర్ అలీ, ఫకార్ జమాన్ లు హాఫ్ సెంచరీలు సాధించి శుభారంభాన్ని అందించారు. అజహర్ అలీ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఫకార్ జమాన్ 60 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలో ఒక లైఫ్ తో బతికిబయట పడ్డ ఫకార్ మరొకసారి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతనికి అజహర్ అలీ నుంచి చక్కటి సహకారం లభించింది. అయితే 23 ఓవర్ లో అజహర్ అలీ(59) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ 25.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ముందుకు సాగుతోంది. స్కోరు బోర్డుపై రన్ రేట్ కాపాడుకుంటూ నిలకడైన ఆటను ప్రదర్శిస్తోంది. భారత్ బౌలింగ్ లో పసలేకపోవడంతో పాకిస్తాన్ బ్యాట్స్మన్లు ఎటువంటి తడబాటు లేకుండా పరుగులు రాబడుతున్నారు.