ఆరు వికెట్లతో చెలరేగాడు..
బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-ఎలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(100; 97 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), లూక్ రోంచీ(65;43 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లు), రాస్ టేలర్(46; 58బంతుల్లో 6 ఫోర్లు) రాణించి పోరాడే లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచారు. ఆటకు మధ్యలో వర్షం కురవడంతో మ్యాచ్ను 46.0 ఓవర్లకు కుదించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత 10వ ఓవర్లో వర్షం పడటంతో కాసేపు ఆటకు అంతరాయం కల్గింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు గప్టిల్, ల్యూక్ రోంచీలు ఇన్నింగ్స్ ను ఎటువంటి తడబాటు లేకుండా ప్రారంభించారు. అయితే న్యూజిలాండ్ స్కోరు 40 పరుగుల వద్ద గప్టిల్(26) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రోంచీకి జత కలిసిన విలియమ్సన్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. రోంచీ-విలియమ్సన్ లు 70 పరుగులు జోడించి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే రోంచీ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, రోంచీ రెండో వికెట్ గా అవుట్ కావడంతో కివీస్ కాస్త తడబడినట్లు కనిపించింది. అయితే ఆపై రాస్ టేలర్-విలియమ్సన్ ల జోడి కుదురుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో న్యూజిలాండ్ తిరిగి గాడిలో పడింది.
ఈ జోడి 99 పరుగులు జత చేసిన తరువాత టేలర్ మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కాసేపటికి విలియమ్సన్ సెంచరీతో మెరిశాడు. కాగా, శతకం సాధించిన వెంటనే విలియమ్సన్ అనవసర పరుగు కోసం యత్నించి నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అయితే ఆ తరువాత ఆసీస్ పేసర్ హజల్ వుడ్ చెలరేగిపోవడంతో న్యూజిలాండ్ వరుస వికెట్లను కోల్పోయింది. ఓవరాల్ గా హజల్ వుడ్ ఆరు వికెట్లు సాధించడంతో న్యూజిలాండ్ 45 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది.