Hazlewood
-
వార్నర్ కూడా అవుట్
న్యూఢిల్లీ: భారత పర్యటనలో మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఆ్రస్టేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. కాలి కండరాల గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హాజల్‌వుడ్ సిరీస్ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లిపోగా... హాజల్‌వుడ్ సరసన తాజాగా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోని మిగతా రెండు టెస్టులకూ దూరమయ్యాడు. అతను స్వదేశానికి పయనమవుతాడని, అయితే వచ్చే నెలలో జరిగే మూడు వన్డేల సిరీస్‌కల్లా జట్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేతికి ఫ్రాక్చర్ అయింది. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకునేందుకు పునరావాస శిబిరానికి పంపాలని సీఏ నిర్ణయించింది. నాలుగు టెస్టుల సిరీస్ ముగిశాక జరిగే వన్డే సిరీస్ ఆడతాడని బోర్డు అంచనా వేస్తుంది’ అని సీఏ తెలిపింది. 36 ఏళ్ల ఓపెనర్ ఈ పర్యటనలో నిరాశ పరిచాడు. మైదానంలో గాయపడటంతో అతని స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా రెన్షా బరిలోకి దిగాడు. మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో, నాలుగో టెస్టు 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. -
ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్
లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆరంభమైన రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ప్రారంభంలోనే ఓపెనర్ జేసన్ రాయ్ వికెట్‌ను కోల్పోయింది.. హజల్‌వుడ్ బౌలింగ్‌లో రాయ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో స్కోరు బోర్డుపై పరుగులేమీ చేయకుండానే ఇంగ్లండ్ వికెట్‌ను నష్టపోయింది. మూడు బంతులు మాత్రమే ఆడిన రాయ్..పైనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై కాసేపటకి వన్ డౌన్లో వచ్చిన కెప్టెన్ జో రూట్(14) కూడా పెవిలియన్ బాట పట్టాడు. హజల్‌వుడ్ బౌలింగ్‌లోనే వికెట్లు ముందు దొరికిపోయాడు. దాంతో ఇంగ్లండ్ 26 పరుగులకే రెండో వికెట్లు కోల్పోయింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దు కావడంతో రెండో రోజు టాస్ వేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ కొనసాగిస్తోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. -
ఆరు వికెట్లతో చెలరేగాడు..
బర్మింగ్‌హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-ఎలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 292 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(100; 97 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), లూక్ రోంచీ(65;43 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లు), రాస్ టేలర్(46; 58బంతుల్లో 6 ఫోర్లు) రాణించి పోరాడే లక్ష్యాన్ని ఆసీస్ ముందుంచారు. ఆటకు మధ్యలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను 46.0 ఓవర్లకు కుదించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత 10వ ఓవర్లో వర్షం పడటంతో కాసేపు ఆటకు అంతరాయం కల్గింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు గప్టిల్, ల్యూక్ రోంచీలు ఇన్నింగ్స్ ను ఎటువంటి తడబాటు లేకుండా ప్రారంభించారు. అయితే న్యూజిలాండ్ స్కోరు 40 పరుగుల వద్ద గప్టిల్(26) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో రోంచీకి జత కలిసిన విలియమ్సన్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. రోంచీ-విలియమ్సన్ లు 70 పరుగులు జోడించి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఆ క్రమంలోనే రోంచీ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, రోంచీ రెండో వికెట్ గా అవుట్ కావడంతో కివీస్ కాస్త తడబడినట్లు కనిపించింది. అయితే ఆపై రాస్ టేలర్-విలియమ్సన్ ల జోడి కుదురుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లడంతో న్యూజిలాండ్ తిరిగి గాడిలో పడింది. ఈ జోడి 99 పరుగులు జత చేసిన తరువాత టేలర్ మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కాసేపటికి విలియమ్సన్ సెంచరీతో మెరిశాడు. కాగా, శతకం సాధించిన వెంటనే విలియమ్సన్ అనవసర పరుగు కోసం యత్నించి నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు. అయితే ఆ తరువాత ఆసీస్ పేసర్ హజల్ వుడ్ చెలరేగిపోవడంతో న్యూజిలాండ్ వరుస వికెట్లను కోల్పోయింది. ఓవరాల్ గా హజల్ వుడ్ ఆరు వికెట్లు సాధించడంతో న్యూజిలాండ్ 45 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. -
బ్యాడ్ లక్.. కొంపముంచిన రనౌట్!
ఆక్లాండ్: ఒక్క రనౌట్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. మార్కస్ స్టోయినిస్ చేసిన అసమాన పోరు వృథా అయింది. న్యూజిలాండ్ తో సోమవారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టోయినిస్ చివరివరకు పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. అవతలివైపు ఉన్న హాజిల్ వుడ్ తప్పిదంతో స్టోయినిస్ శ్రమ ఫలించలేదు. 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ తో విజయం అంచుల వరకు తీసుకొచ్చాడు. 43 ఓవర్లలో క్రీజులోకి వచ్చిన చివరి బ్యాట్స్ మన్ హాజిల్ వుడ్ అవుట్ కాకుండా చూసేందుకు తానే స్ట్రెకింగ్ తీసుకుంటూ వచ్చాడు. వరుసగా మూడు ఓవర్ల పాటు చివరి బంతికి సింగిల్ తీసి తానే స్ట్రెకింగ్ తీసుకున్నాడు. హాజిల్ వుడ్ 26 నిమిషాల పాటు క్రీజులో ఉన్నా ఒక్క బంతిని కూడా ఎదుర్కోనివ్వకుండా స్టోయినిస్ కాపు కాశాడు. అంతేకాకుండా పదో వికెట్ కు 54 పరుగుల పార్టనర్ షిప్ నమోదైతే అందులో హేజిల్‌వుడ్ ది ఒక్క పరుగు కూడా లేదు. 47వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి మళ్లీ స్ట్రెకింగ్ కు వద్దామనుకున్న స్టోయినిస్ ప్రయత్నానికి విలియమ్సన్ గండి కొట్టాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ హేజిల్‌వుడ్‌ను అనూహ్యంగా రనౌట్ చేయడంతో స్టోయినిస్ పోరాటం ముగిసింది. ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అయితే స్టోయినిస్ అసమాన పోరాటం క్రికెట్ అభిమానులతో పాటు దిగ్గజాలను ఆకట్టుకుంది. స్టోయినిస్ పై పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు.