బ్యాడ్ లక్.. కొంపముంచిన రనౌట్!
ఆక్లాండ్: ఒక్క రనౌట్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. మార్కస్ స్టోయినిస్ చేసిన అసమాన పోరు వృథా అయింది. న్యూజిలాండ్ తో సోమవారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టోయినిస్ చివరివరకు పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. అవతలివైపు ఉన్న హాజిల్ వుడ్ తప్పిదంతో స్టోయినిస్ శ్రమ ఫలించలేదు.
67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోయినిస్ సంచలన ఇన్నింగ్స్ తో విజయం అంచుల వరకు తీసుకొచ్చాడు. 43 ఓవర్లలో క్రీజులోకి వచ్చిన చివరి బ్యాట్స్ మన్ హాజిల్ వుడ్ అవుట్ కాకుండా చూసేందుకు తానే స్ట్రెకింగ్ తీసుకుంటూ వచ్చాడు. వరుసగా మూడు ఓవర్ల పాటు చివరి బంతికి సింగిల్ తీసి తానే స్ట్రెకింగ్ తీసుకున్నాడు. హాజిల్ వుడ్ 26 నిమిషాల పాటు క్రీజులో ఉన్నా ఒక్క బంతిని కూడా ఎదుర్కోనివ్వకుండా స్టోయినిస్ కాపు కాశాడు. అంతేకాకుండా పదో వికెట్ కు 54 పరుగుల పార్టనర్ షిప్ నమోదైతే అందులో హేజిల్‌వుడ్ ది ఒక్క పరుగు కూడా లేదు.
47వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి మళ్లీ స్ట్రెకింగ్ కు వద్దామనుకున్న స్టోయినిస్ ప్రయత్నానికి విలియమ్సన్ గండి కొట్టాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ హేజిల్‌వుడ్‌ను అనూహ్యంగా రనౌట్ చేయడంతో స్టోయినిస్ పోరాటం ముగిసింది. ఆరు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అయితే స్టోయినిస్ అసమాన పోరాటం క్రికెట్ అభిమానులతో పాటు దిగ్గజాలను ఆకట్టుకుంది. స్టోయినిస్ పై పలువురు మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపించారు.