
అందుకు ధోనినే కారణం..
న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో కేదర్ జాదవ్ పాత్ర వెలకట్టలేనిది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా పయనిస్తున్నప్పుడు కేదర్ చక్కటి బ్రేకిచ్చాడు. బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను బౌల్డ్ చేయడమే కాకుండా, మరో కీలక ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ ను సైతం అవుట్ చేశాడు. హాఫ్ సెంచరీలు చేసి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో వారిద్దర్నీ జాదవ్ పెవిలియన్ కు పంపాడు. అయితే తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్ కు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనినే కారణమంటున్నాడు జాదవ్.
'గత ధోని సారథ్యంలో నా బౌలింగ్ లో మెరుగుదలకు బీజం పడింది. నేను భారత జట్టులోకి వచ్చిన్నప్పట్నుంచీ ఎక్కువ సమయం ధోనితోనే గడిపా. అతని నుంచి అనేక విషయాలు నేర్చుకునే వాణ్ని. ఆ క్రమంలోనే నా నుంచి ధోని ఏమి కోరుకుంటున్నాడో నాకు అర్థమయ్యేది. అతని కళ్ల ద్వారా నా నుంచి ఏమి ఆశిస్తున్నాడు తెలుసుకునే వాడ్ని. అదే రకంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యే వాడిని. ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా నాపై నమ్మకంతో బంతిని చేతికిస్తున్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో నన్ను ఒక గేమ్ ఛేంజర్ గా మార్చిన ఘనత కోహ్లిది. అయితే నా బౌలింగ్ మెరుగుపడటానికి మాత్రం కచ్చితంగా ధోనినే కారణం' అని కేదర్ జాదవ్ తెలిపాడు.
కాగా, మ్యాచ్ టర్న్ చేసిన జాదవ్ పై కోహ్లి ప్రశంలస వర్షం కురిపించాడు. నెట్స్ లో కేదర్ పెద్దగా బౌలింగ్ చేయకపోయినా, అతనొక స్మార్ట్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. అసలు నిన్నటి మ్యాచ్ లో జాదవ్ బౌలింగ్ ను దింపడానికి ధోనినే కారణమని కోహ్లి పేర్కొన్నాడు. 'ఇక్కడ మొత్తం క్రెడిట్ ను కేదర్ కు ఇవ్వడం లేదు. కేదర్ కు బౌలింగ్ కు ఇచ్చే ముందు ధోనిని సంప్రదించా. మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత జాదవ్ కు బంతిని అప్పజెప్పా. ఆ సమయంలో జాదవ్ బౌలింగ్ మాకు మంచి ఆప్షన్ అనిపించింది. నిజంగా అతను చాలా బాగా బౌలింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడు 'అని కోహ్లి తెలిపాడు.