
ఇక్కడ దూకుడుగా ఆడితే అంతే..!
లండన్: చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లో దూకుడు పనికిరాదని అంటున్నాడు టీమిండియా బ్యాట్స్మన్ కేదర్ జాదవ్. ఇక్కడ అవసరమైతే రంజీ, టెస్టు తరహాల్లో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని జాదవ్ చెప్పుకొచ్చాడు. తొలి వార్మప్ మ్యాచ్ లో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ జాదవ్ ఇంగ్లండ్ లోని పిచ్ పరిస్థితుల్ని పరిశోధించే పనిలో పడ్డాడు. ' న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ ల్లో ప్రతీ పరుగు కోసం ఆటగాళ్లు కష్టపడిన విషయాన్ని గమనించాను. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో వారు నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేకపోయారు.
'పిచ్ పై పచ్చిక బాగా ఉంది. దాంతో పాటు బంతి కూడా బాగా స్వింగ్ అయ్యింది. వచ్చే మ్యాచ్ ల్లో పరిస్థితి ఇలా ఉన్నా దూకుడుగా ఆడేందుకు యత్నించవచ్చు. కానీ టెక్నికల్ గా చూస్తే టెస్టు మ్యాచ్ ల్లోనూ, రంజీల్లోనూ బ్యాటింగ్ చేసినట్లు చేయాలి. మంచి బంతుల్ని కచ్చితంగా వదిలేయాలి. అంటే దూకుడుకు వెళితే అవుటయ్యే ప్రమాదమే ఎక్కువ'అని కేదర్ జాదవ్ అభిప్రాయపడ్డాడు.
నిజానికి కేదర్ జాదవ్ దూకుడుగా ఆడే ఆటగాడే. అయితే ఇంగ్లండ్ లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడితేనే ఆశించిన ఫలితాలుంటాయని పేర్కొన్న జాదవ్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇది తన తొలి చాంపియన్స్ ట్రోఫీ అని, సాధ్యమైనంత వరకూ జట్టు ప్రణాళికలు తగట్టు ఆడతానని తెలిపాడు. ఇందుకోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు జాదవ్ తెలిపాడు.