సెమీస్లోకి విరాట్ సేన.. | india beats south africa to enter semi final in champions trophy | Sakshi
Sakshi News home page

సెమీస్లోకి విరాట్ సేన..

Published Sun, Jun 11 2017 9:21 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

india beats south africa to enter semi final in champions trophy



►మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు సెమీస్లోకి ప్రవేశించింది. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.  'నాకౌట్' పోరులో సఫారీలను చిత్తు చేసిన భారత్.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సఫారీలను కూల్చేసిన టీమిండియా.. ఆపై ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది.  భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(78;83 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్స్), విరాట్ కోహ్లి(76 నాటౌట్; 101 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్ )హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్నందించారు. దక్షిణాఫ్రికా విసిరిన 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించిన కోహ్లి అండ్ గ్యాంగ్.. 38.0 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురేసింది.

సఫారీలు విసిరిన స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు ఆదిలో పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. తొలి ఓవర్ ను మెయిడిన్ ఖాతా ప్రారంభించిన సఫారీలు లైన్ అండ్ లెంగ్త్ ధ్యేయంగా బంతులు విసిరారు. ఈ క్రమంలో ఓపెనర్లు శిఖర్ ధావన్- రోహిత్ శర్మలు స్ట్రైక్ రొటేట్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణాఫ్రికా పేసర్లు రబడా, మోర్నీ మోర్కెల్ నుంచి పదునైన బంతులు ఎదురుకావడంతో భారత్ ఆటగాళ్లు సింగిల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి కూడా దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. తొలి పది ఓవర్లలో మూడు మెయిడిన్లు వేసి బౌలింగ్ లో సత్తా చాటుకున్నారు సఫారీలు. అయితే కోహ్లి-ధావన్లు క్రీజ్లో కుదురుకున్న తరువాత మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. ప్రధానంగా 20 ఓవర్లు దాటిన తరువాత వీరి విజృంభణ మొదలైంది. ముందు శిఖర్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై కోహ్లి అర్థ శతకంతో మెరిశాడు. ఈ జోడి రెండో వికెట్ కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ గెలుపు సులువైంది. మ్యాచ్ ను యువరాజ్ సింగ్(23 నాటౌట్;25 బంతుల్లో 1ఫోర్, 1 సిక్స్) సిక్సర్ తో మ్యాచ్ ను ముగించడం విశేషం. మరొకవైపు గట్టి పోటీ ఇస్తుందనుకున్న దక్షిణాఫ్రికా పూర్తిగా వైఫల్యం చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది.  ఓపెనర్లు డీకాక్-ఆమ్లాలు ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. ఆదిలో ఆచితూచి ఆడుతూ మధ్య మధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యం వచ్చిన తరువాత ఆమ్లా పెవిలియన్ చేరాడు.

ఆపై డీకాక్ కు జత కలిసిన డు ప్లెసిస్ బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 116 పరుగుల వద్ద డీకాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత డివిలియర్స్(16), మిల్లర్(1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. స్కోరును పెంచే క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్  కుమార్, బూమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా,అశ్విన్, పాండ్యా, రవీంద్ర జడేజాలు వికెట్ చొప్పున తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement