
టీమిండియా విజృంభణ..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా విజృంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను 191 పరుగులకే కట్టడి చేసి శభాష్ అనిపించింది. ఏ దశలోనూ సఫారీలను తేరుకోనీయకుండా చేసి భారత్ పైచేయి సాధించింది. భారత దెబ్బకు పేకమేడలా కూలిపోయిన దక్షిణాఫ్రికా కనీసం రెండొందల మార్కును కూడా దాటలేకపోయింది.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీకాక్(53;72 బంతుల్లో 4 ఫోర్లు), హషీమ్ ఆమ్లా(35;54 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(36;50 బంతుల్లో 1 ఫోర్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఆ జట్టు 44.3 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన సఫారీలకు శుభారంభం లభించింది.
ఓపెనర్లు డీకాక్-ఆమ్లాలు ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. ఆదిలో ఆచితూచి ఆడుతూ మధ్య మధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యం వచ్చిన తరువాత ఆమ్లా పెవిలియన్ చేరాడు. ఆపై డీకాక్ కు జత కలిసిన డు ప్లెసిస్ బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 116 పరుగుల వద్ద డీకాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత డివిలియర్స్(16), మిల్లర్(1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. స్కోరును పెంచే క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బూమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా,అశ్విన్, పాండ్యా, రవీంద్ర జడేజాలు వికెట్ చొప్పున తీశారు.