
ఆ రెండు రనౌట్లు నా తప్పిదమే..
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శనతో చతికిలబడింది. భారత్ తో జరిగిన పోరులో కనీసం పోటీ ఇవ్వని సఫారీలు దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. దక్షిణాఫ్రికా పరాజయంలో మూడు రనౌట్లు కీలక పాత్ర పోషించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏబీ డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఇమ్రాన్ తాహీర్ లు రనౌట్లకు పెవిలియన్ చేరారు. ఇందులో భారత ఫీల్డర్లు మెరుపు ఫీల్డింగ్ కు డివిలియర్స్, మిల్లర్లు బలి కావడం ఆ జట్టు ఘోర ఓటమిపై ప్రభావం చూపింది. అయితే డివిలియర్స్, మిల్లర్ల రనౌట్లకు తన తొందరపాటు నిర్ణయమే కారణమని అంటున్నాడు డు ప్లెసిస్.
'డివిలియర్స్, మిల్లర్ ల రనౌట్లకు నా తప్పిదమే కారణం. ఆ ఇద్దరూ మా జట్టులో కీలక ఆటగాళ్లు. అనవసరపు పరుగు కోసం యత్నించి రెండు కీలక రనౌట్లకు కారణమయ్యా. నా అనాలోచిత చర్యతో మేము భారీ మూల్యం చెల్లించుకున్నాం. ఆ ఇద్దరు మరి కొంత సేపు క్రీజ్ లో ఉండి ఉంటే పరిస్థితి మరొలా ఉండేది'అని డు ప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 29 ఓవర్లో జడేజా వేసిన బౌలింగ్ లో బంతిని పాయింట్ దిశగా మరల్చిన డు ప్లెసిస్ పరుగు కోసం డివిలియర్స్ ను పిలిచాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా బంతిని వేగంగా అందుకుని ధోనికి ఇవ్వడంతో డివిలియర్స్ రనౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు. ఆపై డు ప్లెసిస్ సమన్వయ లోపానికి మిల్లర్ సైతం బలయ్యాడు.