లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 'అవుట్' నుంచి తప్పించుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడిన అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో భాగంగా అశ్విన్ వేసిన 30వ ఓవర్ తొలి బంతిని డు ప్లెసిస్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన ఆ బంతికి డు ప్లెసిస్ పరుగు తీసేందుకు ముందుకొచ్చాడు. అయితే అవతలి ఎండ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ కూడా పరుగు కోసం సగం క్రీజ్ దాటి వచ్చాడు.
అయితే ఆ బంతిని వేగంగా అందుకున్న బూమ్రా నాన్ స్టైకింగ్ ఎండ్ వైపు వేగంగా విసిరాడు. దాంతో రనౌట్ తప్పదని భావించిన సఫారీ ఆటగాళ్లు మిల్లర్-డు ప్లెసిస్లు తమను అవుట్ నుంచి రక్షించుకునేందుకు స్ట్రైకింగ్ ఎండ్ వైపు వేగంగా పరుగు తీశారు. ఇక నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో బ్యాట్స్మన్ ఎవరూ లేకపోవడంతో ఆ బంతిని అందుకున్న కోహ్లి ఎటువంటి తడబాటు లేకుండా వికెట్లను ఎగురేశాడు. కాగా, అసలు అవుట్ ఎవరయ్యారనే దాని కోసం ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్ రివ్యూను కోరాల్సి వచ్చింది. ఇక్కడ మిల్లర్ అవుట్ గా పెవిలియన్ చేరాడు.