పాక్‌పై ఫైర్ అయిన లెజెండ్ క్రికెటర్!
కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడంపై
చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత ఉత్కంఠ రేపిన దాయాదుల సమరంలో పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వలేక చేతులు ఎత్తేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ బృందం ప్రదర్శించిన చెత్త ఆటతీరుపై పాక్ క్రికెట్ లెజండ్ ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఒక క్రీడాకారుడిగా ఆటలో గెలుపోటములు భాగమేనని తెలిసినా.. కనీస పోటీ ఇవ్వకుండా భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడం తనకు బాధ కలిగించిందని ప్రస్తుతం రాజకీయ నాయకుడైన ఇమ్రాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
దేశంలో అపారమైన ప్రతిభ ఉందని, ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి.. పునరవ్యవస్థీకరించకపోతే.. భారత్-పాక్ మధ్య అగాథం పెరుగుతూనే ఉంటుందని, ఇలాంటి తీవ్ర నిరాశాజనక పరాజయాలు ఎదురవుతూనే ఉంటాయని ఇమ్రాన్ పేర్కొన్నారు. ప్రొఫెషనల్ మెరిట్ ఆధారంగా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్‌ను నియమించకపోతే దేశంలో క్రికెట్ ఎన్నటికీ మెరుగుపడదని పేర్కొన్నారు.