రెచ్చిపోయిన టీమిండియా: సిక్స్‌లు, ఫోర్ల వర్షం
స్లాగ్ ఓవర్స్‌లో టీమిండియా రెచ్చిపోయింది. ఆఖరి ఓవర్లలో దాయాది పాకిస్థాన్‌కు చుక్కలు చూపించింది. ఇటు విరాట్ కోహ్లి, అటు హార్ధిక్ పాండ్యా ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం రేపారు. చివరి ఓవర్లలో హ్యాట్రిక్ సిక్సర్లతో ప్యాండ్యా దుమ్మురేపాడు. దీంతో టీమిండియా అనూహ్యరీతిలో నిర్ణీత 48 ఓవర్లలో 319 పరుగులు చేసింది. దీంతో వర్షం పడిన ఈ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 324 పరుగుల భారీ లక్ష్యాన్ని దాయాది పాకిస్థాన్ జట్టుకు భారత్ నిర్దేశించింది. భారత్ బౌలింగ్ అటాక్ పటిష్టంగా ఉండటంతో ఇంతటి లక్ష్యాన్ని బలహీనమైన పాక్ ఛేదిస్తుందా చూడాలి.
48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో చివరి నాలుగు ఓవర్లలో 17, 21, 11, 23 పరుగులను టీమిండియా పిండుకోవడం గమనార్హం. యువరాజ్ సింగ్ ఔటవ్వడంతో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యార్దిక్ పాండ్యా చెలరేగి ఆడాడు. ఆరు బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ యువకెరటం చివరి ఓవర్‌లో ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అతని దూకుడు చూస్తే చివరి ఓవర్లో ఆరు సిక్సర్లు కొడతాడా? అన్నంత ఊపు అభిమానుల్లో వచ్చింది. అయితే నాలుగు బంతిని సిక్సర్ తరలించే ప్రయత్నంలో ఎల్బీడబ్ల్యూ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, థర్డ్ ఎంపైర్ రివ్యూలో తప్పించుకున్న పాండ్యా ఆ తర్వాత బంతికి సింగిల్ మాత్రమే కొట్టాడు.
మొత్తానికి అతను ఆరు బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లి కూడా చివరి ఓవర్లలో చెలరేగిపోయాడు. చివరి బంతిని ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించిన కోహ్లి 68 బంతుల్లో 81 పరుగులు చేశాడు. చివరి ఓవర్లు వేసిన పాక్ బౌలర్లు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. చివరి ఓవర్ వేసిన ఇమద్ వాసిం మూడు సిక్సలు, ఒక ఫోర్‌తో 23 పరుగులు ఇవ్వగా, 46వ ఓవర్ వేసిన వహబ్ రియాజ్ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ర్‌తో 17 పరుగులు ఇచ్చాడు.