కోహ్లి ఆశ్చర్యం
బర్మింగ్‌హామ్: బంగ్లాదేశ్ సులువుగా లొంగుతుందని అనుకోలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. బంగ్లా నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావించానని, కానీ ఎటువంటి పోరాటం లేకుండానే ఆ జట్టు తోక ముడవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీస్‌లో భారత్ చేతిలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ప్రమాదకరమైన జట్టుగా పరిగణించిన బంగ్లాదేశ్ ఘోరంగా ఓడిపోవడం తనను ఆశ్చర్యం కలిగించిందన్నాడు. 9 వికెట్ల భారీ తేడాతో గెలుస్తామని అస్సలు ఊహించలేదన్నాడు. ‘ఇంత ఘన విజయం సాధిస్తామని అనుకోలేదు. టాప్ ఆర్డర్‌లో నాణ్యమైన క్రికెట్ ఆడాం. ఓపెనర్లు ఇద్దరూ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. దీంతో నేను ఎటువంటి ఒత్తిడిని లోనుకాకుండా సహజంగా ఆడటానికి ఆస్కారం లభించింది. బంతిలోనూ రాణించాం. ఆ రెండు వికెట్లు కోల్పోవడం వల్లే బంగ్లాదేశ్ దూకుడు తగ్గింది. జాదవ్ బాగా బౌలింగ్ చేశాడు. పిచ్‌ను బట్టి బంతి ఎక్కడ వేయాలో జాదవ్‌కు తెలుసు. 300 పరుగులు చేధించాల్సి వస్తుందనుకున్నాను. కేదార్ బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపం మారింది. బంగ్లాను 264 పరుగులకు కట్టడిచేయగలిగామ’ని కోహ్లి చెప్పాడు. పాకిస్తాన్‌తో ఆదివారం జరగనున్న ఫైనల్‌ను మరో మ్యాచ్‌లాగే చూస్తామని అన్నాడు.