
పాకిస్తాన్ లక్ష్యం పెరిగింది..
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కు టీమిండియా నిర్దేశించిన విజయలక్ష్యం 320.
బర్మింగ్హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కు టీమిండియా నిర్దేశించిన విజయలక్ష్యం 320. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 48 ఓవర్లలో(కుదించిన ఓవర్ల ప్రకారం) మూడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. అయితే అవే ఓవర్లకు ఇక్కడ పాకిస్తాన్ లక్ష్యం పెరిగింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 324 పరుగులు చేయాల్సి ఉంది. దాంతో మూలుగే నక్క మీద తాటికాయ పడిన చందంగా తయారైంది పాక్ పరిస్థితి. భారత్ విసిరిన భారీ లక్ష్యానికే తొలుత ఉలిక్కిపడిన పాకిస్తాన్ కు అదనంగా మరో నాలుగు పరుగులు చేరడం ఆ జట్టుకు మరింత భారంగా మారింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఇరగదీసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(91;119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్(68;65 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో పాటు, కెప్టెన్ విరాట్ కోహ్లి(81 నాటౌట్;68 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (53; 32 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.