భారీగా దెబ్బతీసింది ఆ ఇద్దరి బౌలింగే!
లండన్: భారత బౌలర్లపై ఎంతో నమ్మకంతో కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు. ఒక్క భువనేశ్వర్ తప్ప ఎవరూ అంచనాల తగ్గట్టు రాణించలేదు. మొదటినుంచి దూకుడుగా ఆడిన పాకిస్థాన్ జట్టు టీమిండియా శిబిరాన్ని ఆరంభంలోనే ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఫకర్ జమాన్ సెంచరీకితోడు.. చివర్లో దూకుడుగా హఫీజ్ అర్ధసెంచరీ చేయడంతో పాకిస్థాన్ 339 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.
స్పిన్ బౌలింగ్‌లో 137 పరుగులు..
పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ దూకుడును కట్టడి చేయడంలోనూ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలోనూ భారత స్పిన్ బౌలర్లు విఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో పరుగులు అడ్డుకుంటారనుకున్న స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడ్డేజా.. ఇద్దరూ చేతులెత్తేశారు. అశ్విన్, జడ్డేజా కలిసి వేసిన 18 ఓవర్లో పాక్ బ్యాట్స్‌మెన్ 137 పరుగులు పిండుకోవడం.. పాక్‌ను పరిమిత లక్ష్యానికి నిలువరించాలన్న టీమిండియా ఆలోచనను భారీగా దెబ్బతీసింది. డేత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరొందిన బుమ్రా సైతం ఒత్తిడిని తట్టుకొని నిలబడలేకపోయాడు. తొమ్మిది ఓవర్లు వేసిన అతను ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో మూడు నోబాల్స్, ఐదు వైడ్లు ఉన్నాయి. 10 ఓవర్లలో భువీ ఓ వికెట్ తీసుకొని.. 44 పరుగులు ఇచ్చి.. పాక్ ఎదురుదాడిలోనూ తట్టుకొని నిలబడ్డాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. భువీకి కాస్తో-కూస్తో తోడుగా నిలిచింది హార్దిక్ పాండ్యా మాత్రమే. పాండ్యా 10 ఓవర్లలో ఓ వికెట్ తీసుకొని 53 పరుగులు ఇచ్చాడు.